బీజేపీ పెద్దాయనకు ఎంత కష్టం.. 4.30 గంటలు.. వంద ప్రశ్నలు

By సుభాష్  Published on  25 July 2020 5:23 AM GMT
బీజేపీ పెద్దాయనకు ఎంత కష్టం.. 4.30 గంటలు.. వంద ప్రశ్నలు

బీజేపీ కురువృద్ధుడుగా అందరికి సుపరిచితుడైన ఎల్ కే అద్వానీ ప్రత్యేక పరిస్థితిని తాజాగా ఎదుర్కొన్నారు. అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేసిన కేసుకు సంబంధించిన విచారణకు ఆయన హాజరయ్యారు. 92 ఏళ్ల వయసులో ఆయన్ను అప్పుడెప్పుడో 28 ఏళ్ల క్రితం జరిగిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. నాలుగున్నర గంటల పాటు విచారణ చేయటం గమనార్హం. తాజాగా జరిపిన సీబీఐ విచారణలో ఏకంగా వంద ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా తెలుస్తోంది.

వీడియోకాన్ఫరెన్సు ద్వారా నిర్వహించిన విచారణలో అద్వానీ సమాధానాల్ని సీబీఐ కోర్టు రికార్డు చేసింది. ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు ఈ విచారణ సాగింది. ఈ సందర్భంగా తన మీద చేసిన ఆరోపణల్ని అద్వానీ ఖండించినట్లుగా తెలుస్తోంది. వివాదాస్పద కట్టడం కూల్చివేతలో అద్వానీ.. మురళీ మనోహర్ జోషి తో సహా మొత్తం 32 మంది ఆరోపనలు ఎదుర్కొంటున్నారు.

వారంతా తమ వాదనలు వినిపించొచ్చని న్యాయమూర్తి చెబుతున్నారు. ఈ కేసును ఆగస్టు 31 లోపు విచారణ పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టును సుప్రీంకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీం విధించిన గడువు కంటే ముందే పూర్తి చేయాలని భావిస్తున్నారు. సీబీఐ కోర్టులో తన వాంగ్మూలాన్ని రికార్డు చేయటానికి ముందు రోజే అద్వానీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇద్దరు భేటీ కావటం.. దాదాపు అరగంట పాటు వారి సమావేశం సాగటం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఇంత పెద్ద వయసులో అన్నేసి గంటల పాటు.. వంద ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన రావటం అద్వానీకి సాధ్యమైందని చెప్పక తప్పదు.

Next Story