లైవ్ వీడియో చాట్ యాప్స్.. ఎవరికి నచ్చినట్లు వాళ్లు..!
By సుభాష్ Published on 20 July 2020 7:11 AM GMTకొద్దిరోజుల కిందటే భారత్ లో టిక్ టాక్ ను తీసేయడంతో ఆ స్థానంలోకి రావడానికి వివిధ సంస్థలకు చెందిన యాప్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వేరే విధమైన ఎంటర్టైన్మెంట్ ను ఎంచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం లైవ్ వీడియో చాట్ యాప్స్ బాగా వైరల్ వినియోగిస్తూ ఉన్నారు. కొన్ని మిలియన్ల మంది యూజర్లు ఈ లైవ్ వీడియో చాట్ యాప్స్ ను వాడుతున్నట్లు తెలుస్తోంది.
ముక్కూ, మొఖం తెలియని వారితో ఈ లైవ్ వీడియో చాట్ యాప్స్ ద్వారా సంభాషణలు జరిపే వీలు ఉంటుంది. దీంతో పలు యాప్స్ కు భారత్ లో మంచి డిమాండ్ ఉంది. Chamet, LivU, WHO, Azar.. ఈ నాలుగు యాప్స్ కు భారత్ లోని ప్లే స్టోర్ లో మంచి డిమాండ్ ఉంది. ప్లే స్టోర్ లోని టాప్-10 యాప్స్ లో Chamet, LivU, WHO, Azar లు స్థానం సంపాదించాయి.
యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ ఈ యాప్స్ బాగా ఆర్జిస్తూ ఉన్నాయని తెలిపింది. భారత మార్కెట్ లో ఒక్కో టాప్ సంస్థ 2,00,000 డాలర్ల నుండి 3,00,000 డాలర్ల వరకూ ప్రతి నెలా సంపాదిస్తున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ యాప్స్ ను కొద్ది నిమిషాల పాటూ వాడిన తర్వాత వీడియో కాల్ కు కాయిన్స్ ను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ కాయిన్స్ ను డబ్బు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక ఒక్కో యూజర్ తమ స్థాయిని పెంచుకోవాలంటే అందుకు తగ్గట్టు డబ్బును కట్టాల్సి ఉంటుంది. వందలలో ఖర్చు చేయడం నుండి వేళల్లో ఖర్చు పెట్టే వాళ్లు కూడా ఉంటారు. దీంతో ఈ యాప్స్ కు భారీగా ఆదాయం అందుతోంది.
భారత్ లో లాక్ డౌన్ ను అమలు చేస్తున్న సమయంలో ఈ యాప్స్ ను విపరీతంగా వాడడం మొదలుపెట్టారు. ఉదాహరణకు FancyU యాప్ ను తీసుకుంటే.. ఫిబ్రవరి నెలలో 5000 డాలర్లు పెట్టి యాప్ లో కొనుగోళ్లు చేశారు. జూన్ నెలలో అది ఏకంగా 38000 డాలర్లకు వెళ్ళింది. 300000 ఆండ్రాయిడ్ యూజర్లు ఫిబ్రవరి నెలలో యాప్ ను ఉపయోగించడం మొదలుపెట్టగా.. మార్చి నెలలో అది రెండింతలు అయ్యింది. మే నెలలో ఆ యాప్ మిలియన్ డౌన్ లోడ్ల మార్కును ప్లే స్టోర్ లో అందుకుంది.
ఈ వీడియో చాట్ యాప్స్ చాలా వరకూ చైనా, హాంగ్ కాంగ్, కొరియా, అమెరికాకు చెందినవే అని చెబుతూ ఉన్నారు. కొరియాకు చెందిన Azar యాప్ కు మంచి డిమాండ్ ఉండగా.. అచ్చం అలాంటి పేరుతో ఉన్న యాప్స్ చాలా వరకూ మార్కెట్ లోకి వచ్చాయి. Azar వంద మిలియన్ డాలర్లు దాటడం విశేషం. భారత్ లో ఈ యాప్ 250000 డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
ఒంటరిగా ఉన్న వ్యక్తులు చాలా వరకూ ఈ యాప్స్ ను వినియోగిస్తూ ఉన్నారని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇక లాక్ డౌన్ లో బయటకు వెళ్లలేకపోవడంతో చాలా మంది ఈ యాప్స్ కు బాగా అలవాటు పడ్డారని తెలుస్తోంది. ఎవరికి తోచినది ఇతరులతో పంచుకునే వీలు ఈ యాప్స్ ద్వారా కల్పిస్తూ ఉండడంతో వీటి వాడకం బాగా ఎక్కువైంది. ఆడ-మగ అన్న తేడా లేకుండా ఈ యాప్స్ ను వినియోగిస్తూ ఉన్నారు. కొత్త వారితో పరిచయం వంటివి ఈ యాప్స్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఈ యాప్స్ ను ఉపయోగించడం పట్ల ఆడవారు కాస్తా నామోషీగా ఫీలవుతున్నప్పటికీ మగవాళ్లకు సాధారణంగా అనిపిస్తూ ఉండొచ్చని నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి యాప్స్ ఎక్కువ మందిని ఆకర్షించడానికి కొంచెం శృంగారభరితమైన మెసేజీలు పంపించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడి చాలా మందిని చాట్ కోసం రప్పించడం వంటివి చేస్తూ ఉంటారని యాప్స్ రివ్యూలలో పేర్కొన్నారు.