పేలిన గ్యాస్ సిలిండర్.. క్రికెటర్ భార్యకు తీవ్రగాయాలు
By తోట వంశీ కుమార్ Published on 30 March 2020 7:10 PM ISTగ్యాస్ సిలిండర్ పేలి బంగ్లాదేశ్ క్రికెటర్ లిట్టన్ దాస్ భార్య సంచితకు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఈ ఘటన జరిగిన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వంట గదిలో టీ పెడుతుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో సంచితకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై లిట్టన్ దాస్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. సిలిండర్‌కి రంధ్రం పడి ఉండంతో గ్యాస్ లీకైందని వెల్లడించారు. పేలుడు సమయంలో సంచిత తన చేతుల్ని ముఖానికి అడ్డుపెట్టడంతో పెద్ద ప్రమాదం తప్పిందని వెల్లడించారు. అయితే.. పేలుడు కారణంగా ఆమె జట్టు చాలా వరకూ కాలిపోయిందని.. శరీరంపైనా అక్కడక్కడ గాయాలైనట్లు తెలిపారు.
ప్రమాదంపై సంచిత మాట్లాడుతూ.. ‘‘ఆ ప్రమాదం గురించి చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. చావుకి చాలా దగ్గరగా వెళ్లినట్లు అనిపించింది. నా చేతులతో ముఖాన్ని కవర్ చేసుకోకుండా ఉండింటే..? నా ముఖం మొత్తం కాలిపోయేది. నిప్పు అంటుకుని ఉండటంతో.. నా హెయిర్‌ని కూడా కట్ చేయాలని వైద్యులు తెలిపారు’’ అని వెల్లడించింది.
కరోనా వైరస్ కారణంగా బంగ్లాదేశ్ క్రికెటర్లు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ మహమ్మారి కట్టడి కోసం క్రికెటర్లతో పాటు లిట్టన్ దాస్ కూడా ఇటీవల తన సగం జీతాన్ని విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. 2019 వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత సంచితని లిట్టన్ దాస్ వివాహం చేసుకున్నాడు.