ప్రధాని మాట విందాం.. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం – పవన్ కళ్యాణ్‌ ఆసక్తికర ట్వీట్

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా.. ప్రధాని మాట విందా అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రెండు రోజుల్లోనే సుమారు 100 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటే ఈ వైరస్‌ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా సోమవారం వరకు 416 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుయ్యాయి. ఇప్పటికే ఎనిమిది మంది చికిత్సపొందుతూ మృతి చెందారు. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, వైరస్‌ను వ్యాప్తిచెందకుండా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు.

Also Read :హద్దు మీరారో.. జైలుకే – మంత్రి కొడాలి నాని హెచ్చరిక

దేశవ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమై జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీనిలో ఏపీలోని పలు జిల్లాలు ఉన్నాయి. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సీఎం జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాగా సోమవారం ఏపీతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో ప్రజలు యథావిధిగా రోడ్లపైకిరావడంతో.. ట్విటర్‌ వేదికగా ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. మనల్ని మనం కాపాడుకొనేందుకే ఈ లాక్‌డౌన్‌ను పెట్టడం జరిగిందని, ఇప్పటికీ ప్రజలు దీనిని తీవ్రంగా పరిగణించడం లేదని ట్వీట్‌ చేశారు. ప్రభుత్వాల మార్గదర్శకాలు ప్రతీ ఒక్కరూ పాటించాలని, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను అంటూ ప్రధాని విజ్ఞప్తి చేశారు.

ప్రధాని ట్వీట్‌కు మద్దతుగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ‘ప్రధాని మాటను పాటిద్దాం’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రధాని మాట పాటిద్దాం, కరోనా విముక్త భారతాన్ని సాధిద్ధాం అని పిలుపునిచ్చారు. మనలని మనం రక్షించుకుందాం. దయచేసి అందరూ కరోనా వ్యాధి తీవ్రతని గుర్తించాలని, లాక్‌ డౌన్‌ని విధిగా పాటించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ప్రజలందరూ పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలంటూ పవన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *