గుట్టు చప్పుడు కాకుండా అక్రమ మద్యం దందా..!
By సుభాష్ Published on 30 April 2020 11:56 AM GMT
ఒక వైపు కరోనా.. మరో వైపు లాక్‌డౌన్.. ఈ కారణంగా జనాలెవ్వరు బయటకు రాని పరిస్థితి. ఏమి కొనలేని పరిస్థితి. లాక్‌డౌన్ కారణంగా అన్ని షాపులతో పాటు మద్యం షాపులు సైతం మూడపడ్డాయి. మద్యం ప్రియులకు మద్యం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మద్యానికి బానిసలుగా మారిన వారికి కంటి నిండ కునుకు లేకుండా పోతోంది. ఎక్కడైన మద్యం దొరికితే చాలు బ్లాక్‌లోనైనా కొనేందుకు సిద్దంగా ఉన్నారు. దీనినే అదనుగా చేసుకుంటున్న కొందరు అక్రమార్కులు బ్లాక్ దందాకు ఎగబడుతున్నారు. బ్లాక్‌లో మద్యాన్ని అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఇక లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత అధికారులు మద్యం షాపులకు సీల్ వేసినా బ్లాక్ మార్కెట్ దందా కొనసాగిస్తన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో భారీ మొత్తంలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. పలు బ్రాండ్లకు చెందిన 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ రెస్ట్ ఇన్ హోటల్ పక్క వీధిలో అక్రమంగా మద్యం నిల్వలు ఉంచి అక్రమంగా తరలిస్తున్నాన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులకు.. దాడులు నిర్వహించి 43 లేబుల్, వైట్ లేబుల్, రెడ్ లేబుల్, బ్లాక్ డాగ్, ఇతర మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారు తరలించే కారును సైతం సీజ్ చేశారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.