భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు!

"తిన్న వెంటనే స్నానం చేయకూడదు" అని మన పెద్దలు చెబుతుంటారు. దీన్ని చాలా మంది పాతకాలపు నమ్మకంగా కొట్టిపారేస్తారు.

By -  అంజి
Published on : 10 March 2026 1:30 PM IST

Digestion Tips, Bathing After Meals, Health Risks of Bathing After Food, Blood Circulation and Digestion, Stomach Problems, Health Tips Telugu

భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు!

"తిన్న వెంటనే స్నానం చేయకూడదు" అని మన పెద్దలు చెబుతుంటారు. దీన్ని చాలా మంది పాతకాలపు నమ్మకంగా కొట్టిపారేస్తారు. కానీ, దీని వెనుక శాస్త్రీయ కారణం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ సజావుగా సాగాలంటే శరీరం ఒక క్రమపద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల ఆ ప్రక్రియకు ఎలా ఆటంకం కలుగుతుందో ఇక్కడ చూద్దాం.

మనం ఆహారం తీసుకున్న వెంటనే, శరీరంలోని రక్త ప్రసరణ అంతా జీర్ణ వ్యవస్థ వైపు మళ్లుతుంది. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి కడుపు భాగంలో రక్త సరఫరా ఎక్కువగా ఉండటం అవసరం. ఈ సమయంలో జీర్ణ ఎంజైమ్లు చురుగ్గా పనిచేస్తాయి. అయితే, భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది.

నీరు ఒంటిపై పడగానే శరీరం తన ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల పొట్ట వైపు వెళ్లాల్సిన రక్త ప్రసరణ చర్మం వైపు మళ్లుతుంది. ఫలితంగా జీర్ణక్రియ మందగిస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. రక్త ప్రసరణలో మార్పుల వల్ల తిన్న ఆహారం త్వరగా కరగక పొట్ట భారంగా అనిపిస్తుంది. జీర్ణక్రియ మందగించడం వల్ల మనం తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం పూర్తిగా గ్రహించలేదు. రక్త ప్రసరణను అకస్మాత్తుగా మళ్లించడం వల్ల కొన్నిసార్లు రక్తపోటులో మార్పులు వచ్చి గుండెపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది.

నిపుణులు సూచించే జాగ్రత్తలు:

ఆయుర్వేదం మరియు ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం.. భోజనానికి, స్నానానికి మధ్య కనీసం 30 నుండి 45 నిమిషాల వ్యవధి ఉండాలి. ఒకవేళ వీలైతే భోజనానికి ముందే స్నానం చేయడం ఉత్తమం. దీనివల్ల శరీరం రిలాక్స్ అయ్యి, ఆకలి పెరిగి జీర్ణక్రియ మరింత మెరుగ్గా సాగుతుంది. అలాగే తిన్న వెంటనే సిగరెట్ తాగడం 10 సిగరెట్లు తాగడంతో సమానమని పరిశోధనలు చెబుతున్నాయి. భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల 'యాసిడ్ రిఫ్లక్స్' (గుండెల్లో మంట) వచ్చే అవకాశం ఉంటుంది. తిన్న వెంటనే పండ్లు తింటే అవి జీర్ణాశయంలోని గ్యాస్‌తో కలిసి పులిసిపోయి ఎసిడిటీకి కారణమవుతాయి.

Next Story