దీపావళి ఎప్పుడు, ఏ సమయంలో జరుపుకోవాలి?.. పూర్తి వివరాలు మీ కోసం
When and at what time should Diwali be celebrated?.. Full details are for you. ఈ సంవత్సరం దీపావళి రోజున గ్రహణం వస్తోంది. అది కూడా కేతుగ్రస్త పాక్షిక సూర్య గ్రహణం తుల రాశిలో స్వాతి నక్షత్రంలో
By అంజి Published on 23 Oct 2022 2:10 PM IST
ఈ సంవత్సరం దీపావళి రోజున గ్రహణం వస్తోంది. అది కూడా కేతుగ్రస్త పాక్షిక సూర్య గ్రహణం తుల రాశిలో స్వాతి నక్షత్రంలో వస్తోంది. కాబట్టి ఈ సంవత్సరం దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?, నరక చతుర్ధశి మంగళ హారతులు ఎప్పుడు ఇచ్చుకోవాలి?, లక్ష్మీ పూజలు ఎప్పుడు చేసుకోవాలి?, కేదార వ్రతం ఎప్పుడు ఆచరించాలి? అనే విషయమై చాలా మంది సందేహ పడుతున్నారు. అయితే దీపావళి సందర్భంగా ప్రజల మనస్సులో ఉన్న సందేహాలను డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు నివృత్తి చేశారు.
బాచంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ''ఈ సంవత్సరం అక్టోబర్ 25 మంగళవారం రోజున సంధ్యా సమయంలో గ్రహణం ఉంది. కాబట్టి దీపావళి అంటే అమావాస్య. లక్ష్మీ పూజ చేసుకోవాలంటే అర్ధరాత్రి అమావాస్య అనేది తప్పనిసరిగా ఉండాలి. అర్ధరాత్రి అమావాస్య అనేది 24వ తేదీనే ఉండటం వల్ల దీపావళి లక్ష్మీ పూజలు అక్టోబర్ 24 తేదీ సోమవారం నాడు రాత్రి లక్ష్మీ పూజలు చేసుకోవచ్చు. దీనిలో ఎలాంటి సందేహాలు పడాల్సిన అవసరం లేదు.'' అని చెప్పారు.
''నరక చతుర్ధశి మంగళ హారతులు తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రసిద్ధం. ధర్మశాస్త్ర రీత్యా.. చతుర్ధశి రోజున చతుర్ధశి ఉదయ వ్యాపిణి అయి ఉండి, స్వాతి నక్షత్రం వస్తే ఇంకా మంచిదని అని శాస్త్రం చెబుతోంది. అందువల్ల 24వ తేదీ సోమవారం నాడు ఉదయం నరక చతుర్ధశి సమయంలో మంగళహారతులను సూర్యోదయం 4.20 నిమిషాల నుండి 6.10 నిమిషాల వరకు అందరూ కూడా ఆచరించుకోవచ్చు. అదే రోజు అభ్యంగన స్నానం చేయాలి. అదే రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేయాలి.'' అని బాచంపల్లి చెప్పారు.
అలాగే వ్యాపార పుస్తక ప్రారంభ సమయాలకు సంబంధించిన విషయాలను కూడా బాచంపల్లి చెప్పారు. దీపావళి రోజున ఉదయం లక్ష్మీ పూజా ఉదయం 7.50 నిమిషాల నుండి ఉదయం 10.05 నిమిషాలకు చేయొచ్చన్నారు. మధ్యాహ్నం 2.05 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3.45 వరకు లక్ష్మీ పూజా చేసుకోవచ్చని బాచంపల్లి చెప్పారు. ఇక రాత్రి అయితే 7.05 నిమిషాల నుండి 9.30 నిమిషాల మధ్యలో లక్ష్మీ పూజా చేసుకోవచ్చు. అలాగే రాత్రి 11.30 నిమిషాల నుంచి 12.20 నిమిషాల వరకు లక్ష్మీదేవికి పూజలు చేయవచ్చన్నారు.
''దీపావళి లక్ష్మీ పూజలు, అలాగే నరక చతుర్ధశి మంగళహారతులు అక్టోబర్ 24 సోమవారం నాడే ఆచరించాలి. ఇక 25వ తేదీన కేదారేశ్వర వత్రం చేయాల్సి ఉంటుంది. కేదార వ్రతానికి అమావాస్య మధ్యాహ్నం వ్యాపిణి అయి ఉండాలి. ఈ రోజు గ్రహణం వస్తుంది కనుక.. గ్రహణం అయిపోయిన తర్వాత రాత్రి కేదార వ్రతం చేసుకోవచ్చు. లేదంటే ఉదయం చూసుకోవచ్చు. పౌర్ణమి లోపు ఎప్పుడైనా కేదారేశ్వర వత్రం ఆచరించవచ్చు. ఈ సమయంలో మీ ఇంట్లో మీ పెద్దవారి మాటలు, వారి ఆచారాలను పాటించడం ఉత్తమం. కాబట్టి కేదారేశ్వర వత్రం గ్రహణం అనంతరం ఆచరించడం మంచిది.'' అని చెప్పారు. అందుకే దీపావళి పండుగకు సంబంధించి గ్రహణం విషయంలో ఎలాంటి సందేహాలు పడాల్సిన అవసరం లేదు.