ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ఏ సమాచారం కావాలన్నా కొన్ని క్షణాల్లో మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఒకప్పుడు ఇంటర్నెట్ వేగం చాలా తక్కువగా ఉండగా.. ఇప్పుడు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక పరిస్థితి మారింది. సమాచారం మరింత వేగంగా మనకు చేరుతోంది. ఇది గొప్ప విషయమే అయినా ఈ హైస్పీడ్ ఇంటర్నెట్.. ఊబకాయం ముప్పు పెంచుతోందని ఆస్ట్రేలియా పరిశోధకుడు గుర్తించారు. అధిక వేగంతో ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల ప్రజలు ఒకే చోట కూర్చొని ఎలాంటి శారీరక శ్రమ లేకుండా మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్లకు కొన్ని గంటల పాటు అతుక్కుపోతున్నట్టు వెల్లడించారు.
ఫలితంగా శారీరక శ్రమ కరవై,, శరీరంలో కేలరీలు ఖర్చుగాక వారిలో ఊబకాయం ముప్పు పెరుగుతున్నట్టు తెలిపారు. స్క్రీన్ చూస్తూ అనేక రకాల జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఊబకాయం ముప్పు మరింత పెరుగుతోందట. మోనాష్ బిజినెస్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు 2006 నుంచి 2019 మధ్య ఉన్న హౌజ్‌హోల్డ్, ఇన్ కం అండ్ లేబర్ డైనమిక్స్ ఇన్ ఆస్ట్రేలియా డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని తేల్చారు. అందుకే ఉద్యోగం, వినోదం కోసం ఇంటర్నెట్ వాడుతున్నా.. మన ఆరోగ్యం కోసం వాకింగ్, రన్నింగ్, ఇతర వ్యాయమాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.