Ugadi 2023: ఉగాది పచ్చడి ప్రాముఖ్యత, తయారు చేసే విధానం ఇదే
By అంజి Published on 19 March 2023 4:49 AM GMTఉగాది పచ్చడి ప్రాముఖ్యత, తయారు చేసే విధానం ఇదే
, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తుంటారు. ఈ ఏడాది ఉగాది మార్చి 22న వస్తుంది. ఇది సంక్రాంతి తర్వాత వచ్చే హిందూ నూతన సంవత్సరం యొక్క మొదటి రోజును సూచిస్తుంది. ఇది వసంత రుతువు ప్రారంభాన్ని తెలియజేస్తుంది. తెలుగు నెలలైన చైత్ర, వైశాఖ మాసాల్లో వసంతరుతువు కనువిందు చేస్తుంది. కొత్త సంవత్సర ప్రారంభానికి నాంది పలికేందుకు ఉగాది రోజున ప్రజలు రంగోలీ అలంకరణ, మామిడి ఆకులతో ఇంటిని ఆలంకరించుకుంటారు.
ఉగాది పచ్చడి.. ఉగాది వేడుకలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దక్షిణ భారతదేశంలోని ఉగాది ప్రత్యేక భోజనంలో ఉగాది పచ్చడి ప్రత్యేకమైన, రుచికరమైనదిగా ఉంటుంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైనది. ఏడాది పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సమంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.
ఈ పచ్చడిని తయారు చేసేందుకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఇలా ఈ షడ్రుచులు కలిపి ఉండే పచ్చడి తింటే చక్కటి ఆరోగ్యంతో ఉంటారు. ఆయా కాలాలను బట్టి ఆయా ఆహారాలు తినే సంప్రదాయం మన భారతీయకులకు మాత్రమే ప్రత్యేకమని నిరూపించే పండుగల్లో ‘ఉగాది’పండుగ అత్యంత శ్రేష్టమైనది. ఈ షడ్రుచులు మనోలోని వివిధ భావోద్వేగాలను చూపిస్తుంటాయి. అయితే ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఈ భావోద్వేగాలన్నింటినీ దాటవలసి ఉంటుంది. మనం ఏదైనా ప్రత్యేకమైన అనుభూతికి అతుక్కుపోకూడదు. ప్రతిదీ భగవంతుడి బహుమతిగా స్వీకరించి జీవితంలో ముందుకు సాగాలి.
ఉగాది పచ్చడికి కావల్సిన పదార్థాలు:
వేపపువ్వు- తగినంత, కొబ్బరి ముక్క -1, పచ్చి మిరపకాయ - 1, చెరుకు ముక్క - 1, అరటిపళ్లు- 2, చింతపండు - తగినంత, బెల్లం- 100 గ్రాములు, చిన్న మామిడికాయ- 1, ఉప్పు- తగినంత, నీళ్లు - సరిపడా
తయారీ విధానం: చెరుకు, కొబ్బరి, బెల్లం, మిర్చి, మామిడికాయను చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వేప పువ్వును శుభ్రంగా కడుక్కోవాలి. తగినన్ని నీళ్లలో చింతపండును బాగా కలిపి వడకట్టిన పులుపు నీళ్లను చిన్న కొత్త కుండలోకి పోయాలి. అందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు, చెరకు, కొబ్బరి, మిర్చి, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి. చివరగా అరటిపండు ముక్కలు వేయాలి. అంతే ఎంతో రుచికరమైన ఉగాది పచ్చడి రెడీ.