ప్రతి మనిషి జీవితంలో.. మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఇడే ప్రతి బిడ్డకూ తొలి బడి. తన తల్లి అని ఎవరూ చెప్పకపోయినా బిడ్డ.. అమ్మా అని పిలుస్తాడు. మాతృ భాష కూడా అంతే సహజంగా అబ్బుతుంది. మాతృ భాషను మరవకూడదనే ప్రతి ఏటా ఫిబ్రవరి 21న 'అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం' జరుపుకుంటున్నాం..
మాతృ భాష గొప్పతనం
ఏ దేశ పౌరుడైనా.. తన తల్లి భాషకు మొదటి విద్యార్థే. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. ఇతర భాషలు నేర్చుకుంటూనే మాతృభాషను పరిరక్షించుకోవాలి. మాతృభాషకు ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్న యునెస్కో 1999 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 21న మాతృ భాష దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు జరుపుకోవాలని నిర్ణయించింది.
2000, ఫిబ్రవరి 21 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటీని రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడటం ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యూనెస్కో చెబుతోంది. బంగ్లాదేశీయులు (తూర్పు పాకిస్తానీయులు) చేసిన బెంగాలీ బాషా ఉద్యమానికి నివాళిగా దీనిని నిర్వహిస్తున్నారు.
'దేశ భాషలందు తెలుగు లెస్స' అని శ్రీకృష్ణదేవరాయలు అఉన్నారు. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని ఎందరో కవులు చెప్పారు. అంతటి తీయనైన తెలుగు భాషను మరువకుండా ప్రతి రోజూ తోటి వారితో మాట్లాడుదాం. మన తల్లి భాషను గౌరవిద్దాం. మన మాతృభాషను, యాసను కాపాడుకోవడమే కాదు.. భావితరాలకు కూడా అందించి మన భాషను బతికించుకుందాం..