దీపావళి పండుగ.. టపాసులు పేల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

దీపావళి పండుగ వచ్చిందంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఆనందమే. చిన్నాపెద్దా అంతా టపాసులు కాల్చడానికి ఎంత ఆసక్తి చూపుతారు.

By అంజి  Published on  30 Oct 2024 2:45 AM GMT
precautions, firecrackers, tapas, Diwali

దీపావళి పండుగ.. టపాసులు పేల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

దీపావళి పండుగ వచ్చిందంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఆనందమే. చిన్నాపెద్దా అంతా టపాసులు కాల్చడానికి ఎంత ఆసక్తి చూపుతారు. అయితే ఇవి కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

క్రాకర్స్‌ కాల్చేటప్పుడు నిప్పు రవ్వలు కొన్నిసార్లు ఒంటిపై పడే అవకాశం ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు టీషర్లు, జీన్స్‌ వంటి దుస్తులు కాకుండా బాగా వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు వేసుకోవడం మంచిది. కంటి అద్దాలు ఉంటే పెట్టుకోవాలి. టపాసులు కాల్చేటప్పుడు పక్కనే బకెట్‌ నీళ్లను సిద్ధంగా ఉంచుకోవాలి. అనుకోకుండా మంటలు వ్యాపిస్తే ఆర్పడానికి ఇవి ఉపయోగపడతాయి.

ప్రమాదవశాత్తు దుస్తులపై నిప్పు పడి మంటలు చెలరేగితే దుప్పట్లు లేదా రగ్గులు వంటి మందపాటి బట్టను కప్పేయాలి. అప్పుడు మంటకు ఆక్సిజన్‌ అందక ఆరిపోతుంది. క్రాకర్స్‌ కాల్చేటప్పుడు తప్పకుండా చెప్పులు వేసుకోవాలి. పేలకుండా మధ్యలో ఆగిపోయే టపాసుల జోలికి వెంటనే వెళ్లకూడదు. కొన్నిసార్లు అవి పేలే ప్రమాదం ఉంది. క్రాకర్స్‌ కాల్చేటప్పుడు పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి. టపాసులను కాల్చడానికి వారిని ఒంటరిగా వదలొద్దు.

పెద్ద శబ్దం వచ్చే బాంబులను పేల్చేటప్పుడు పసిబిడ్డలు, పిల్లల చెవుల్లో కాటన్‌ పెట్టడం మంచిది. ఆ శబ్ద తీవ్రతకు కొన్నిసార్లు చెవిలో కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇంట్లో లేదా పరిసర ప్రాంతాల్లో వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు ఉంటే భారీ శబ్దం వచ్చే బాంబులను పేల్చకూడదు.

నిప్పు రవ్వలు పడి చిన్న చిన్న గాయాలు ఏర్పడితే అవి సెప్టిక్‌ కాకుండా ఉండేందుకు, బాధ నుంచి ఉపశమనానికి బర్నాల్‌, దూది, అయోడిన్‌ వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. గాయం పెద్దదైతే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలి.

మద్యం సేవించి టపాసులను కాల్చవద్దు. దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. గాలి బాగా వీచే సమయంలో టపాసులను కాల్చడం మంచిది కాదు. దీని వల్ల నిప్పురవ్వలు సమీపంలోని గుడిసెలు, గడ్డి వాములు, ఇళ్లపై పడి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. సమీపంలో తాటాకు ఇళ్లు, గడ్డి మోపులపై నిప్పుపడి మంటలు చెలరేగితే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేయండి. పిల్లల చేతికి రాకెట్‌, తారజువ్వలు వంటివి ఇవ్వొద్దు. వెలిగించడానికి సిద్ధంగా ఉంచిన క్రాకర్స్‌ను దీపాలకు దూరంగా ఉంచాలి.

Next Story