3 రోజుల సంక్రాంతి వేడుకల్లో నేడు కీలకమైన పండుగ కనుమ. వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే పశువులను ఈ రోజున అలంకరించి పూజించడం ఆనవాయితీ. అందుకే కనుమను పశువుల పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యవసాయంలో వీటి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఇవి రైతుకు మరో ఆదాయ వనరుగా కూడా పని చేస్తుంది. ఈ రోజున పశువులను శుభ్రంగా కడిగి, వాటికి పసుపు కుంకుమ పెట్టి, మెడలో గజ్జెల పట్టీ, కాళ్లకు మువ్వలు వేస్తారు.
ఇలా పశువుల కొమ్ముల నుంచి వాటి తోకల వరకు అన్నింటీని ఆకర్షణీయంగా రూపుదిద్దుతారు. ఒకప్పుడు కనుమ పండుగ సందర్భంగా రైతులు అడవులలోకి వెళ్లి ఔషధ వృక్షాలైన నేరేడు, మద్ది, మారేడు, నల్లేరు, మోదుగ వంటి చెట్ల పూలు, ఆకులు, కాండం, వేర్లు సేకరించి, వాటికి ఉప్పు చేర్చి, బాగా దంచి పొడిలాగా తయారు చేసేవారు. ఆ పొడిని పశువులకు బలవంతంగా అయినా తినిపించేవారు.
పశువులు ఆరోగ్యంగా ఉండాలని, రోగనిరోధక శక్తి సమర్థంగా ఉండాలని అలా చేసేవారు. ప్రస్తుత కాలంలో ఇలాంటివి తగ్గిఓయాయి. అయితే, ఈ రోజున ప్రయాణాలు చేయొద్దంటారు. ఎందుకంటే పూర్వం ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లను ఉపయోగించేవారు. కనుమ రోజున ఎద్దులను పూజించడంతో ఆ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉంచాలనే గొప్ప భావనతో ఆరోజు ప్రయాణం వద్దని చెప్పేవారు.