లిఫ్ట్‌ ప్రమాదాలకు ఇలా చెక్‌ పెట్టండి

ప్రస్తుత కాలంలో అపార్ట్‌మెంట్‌, ఆఫీస్‌, గ్రూప్‌ హౌస్‌ ఇలా ఎక్కడ చూసినా లిఫ్ట్‌ కచ్చితంగా ఉంటుంది. కొంత మంది ఇళ్లల్లో కూడా లిఫ్ట్‌ ఏర్పాటు చేయించుకుంటున్నారు.

By అంజి
Published on : 23 March 2025 1:45 PM IST

precautions, elevator accidents, lift accident

లిఫ్ట్‌ ప్రమాదాలకు ఇలా చెక్‌ పెట్టండి

ప్రస్తుత కాలంలో అపార్ట్‌మెంట్‌, ఆఫీస్‌, గ్రూప్‌ హౌస్‌ ఇలా ఎక్కడ చూసినా లిఫ్ట్‌ కచ్చితంగా ఉంటుంది. కొంత మంది ఇళ్లల్లో కూడా లిఫ్ట్‌ ఏర్పాటు చేయించుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో లిఫ్ట్‌ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిర్వహణ లోపాలే లిఫ్ట్‌ ప్రమాదాలకు ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు. కొందరు బిల్డర్లు, నివాస సముదాయాల యజమానులు ఖర్చు తక్కువ అవుతుందని నాణ్యత లేని లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అవి మొరాయించడం, ఇతర సాంకేతిక సమస్యలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

లిఫ్ట్‌లు వాడే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలను ఒంటరిగా వాటిలోకి అస్సలు పంపొద్దు. తలుపులు మూసుకునేటప్పుడు అడ్డుగా చేతులు, కాళ్లు అస్సలు పెట్టొద్దు. ఆ సమయంలో సెన్సర్లు పని చేయకపోతే చేతులు, కాళ్లు నలిగిపోయే ప్రమాదం ఉంటుంది. లిఫ్ట్‌లో పరిమితికి మించి ఎక్కితే మధ్‌యలో ఆగిపోవడం లేదా ఒకేసారి కుప్పకూలడం జరుగుతుంది. నిపుణుల పర్యవేక్షణలో నిర్వహణ చేయించి, పనితీరును క్షుణ్నంగా పరిశీలించాలి. నాణ్యమైన లిఫ్ట్‌లు మాత్రమే నిపుణులైన ఫిట్టర్ల ద్వారానే ఏర్పాటు చేయించుకోవాలి. డోర్‌ లాక్‌ పడితేనే లిఫ్ట్‌ కదిలేలా ఉండే కిట్లను వాడాలి.

లిఫ్ట్‌లో ఇరుక్కుపోతే..

లిఫ్ట్‌లో ఇరుక్కుపోగానే విపరీతమైన భయం, టెన్షన్‌ వస్తుంది. దీని వల్ల ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, అసౌకర్యంగా అనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి.

లిఫ్ట్‌లోని అలారం బటన్‌ను నొక్కండి. కొన్ని లిఫ్ట్‌ల్లో ఫోన్‌ సింబల్‌ ఉంటుంది. అది నొక్కి సంబంధిత వ్యక్తులకు పరిస్థిగి గురించి వివరించాలి.

లిఫ్ట్‌లో ఇరుక్కున్నప్పుడు కొందరు తలుపు తెరవడానికి ప్రయత్నిస్తారు. ఇది సరికాదు. విద్యుత్‌ సరఫరా ఆపకుండా ఏమీ చేయకూడదు. లేదంటే లిఫ్ట్‌ వేగంగా కింద పడే ప్రమాద ఉంటుంది.

లిఫ్ట్‌ చెడిపోయినప్పుడు కొంత మంది భయపడి పైకి కిందకి దూకడం ప్రారంభిస్తారు. అలా చేయడం ద్వారా లిఫ్ట్‌ మళ్లీ స్టార్ట్‌ అవుతుందని అనుకుంటారు. కానీ ఇది లిఫ్ట్‌ స్టెబిలైజర్‌ సిస్టమ్‌ను డిస్ట్రబ్‌ చేస్తుంది. దీని వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతుంది.

లిఫ్ట్‌ ఆగిపోగానే అన్ని బటన్లను నొక్కడం సరికాదు. దీనిల్ల లిఫ్ట్‌ సాఫ్ట్‌ వేర్‌లో లోపం ఏర్పడి ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది.

Next Story