No Smoking Day: ధూమపానంతో ఈ ప్రమాదాలు తప్పవు
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం తెలిసినా కూడా.. చాలా మంది అదే తప్పు చేస్తుంటారు.
By అంజి Published on 13 March 2024 9:29 AM ISTNo Smoking Day: ధూమపానంతో ఈ ప్రమాదాలు తప్పవు
ధూమపానం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలతో ముడిపడి ఉంటుంది, ఇది తరచుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీస్తుంది, అయితే ధూమపానం అనేది ఒక అలవాటు, సిగరెట్ వ్యసనాన్ని వదిలించుకోవడం, మానేయడం లేదా తగ్గించడం కష్టంగా ఉంటుంది. అది హానికరం అని తెలిసినా తాగుతుంటారు. పొగాకు యొక్క హానికరమైన ప్రభావాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం 'నో స్మోకింగ్ డే'ని జరుపుకుంటారు. భారతదేశంలో 26 కోట్ల మంది పొగాకు తాగుతున్నారు. పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా ప్రతి సంవత్సరం 10 లక్షల మందికి పైగా ప్రజలు తమ జీవితాలను కోల్పోతున్నారు, అయితే నిష్క్రియ ధూమపానం కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది, ఇది తరచుగా ఉబ్బసం, బ్రోన్కైటిస్, న్యుమోనియాకు దారితీస్తుంది.
ఏటా మార్చి రెండో బుధవారం నాడు నో స్మోకింగ్ డేగా గుర్తిస్తారు. మొదట యునైటెడ్ కింగ్‌డమ్‌లో 'నో స్మోకింగ్ డే'ని పాటించే ఆచారం వచ్చింది. అప్పుడే ప్రతి ఏటా మార్చిలో రెండవ బుధవారం నో స్మోకింగ్ డే జరుపుకోవాలని నిర్ణయించారు. ధూమపానం మానేయాలనుకునే ధూమపానం చేసేవారికి సహాయం చేయడానికి ఉద్దేశించిన నో స్మోకింగ్ డేని ఇప్పుడు వార్షిక ఆరోగ్య అవగాహన దినంగా పాటిస్తున్నారు.
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం తెలిసినా కూడా.. చాలా మంది అదే తప్పు చేస్తుంటారు. ధూమపాన అలవాటు వల్ల ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా చాలా ప్రమాదం. పొగాకులోని నికోటిన్ కారణంగా ప్రాణాంతకమైన వ్యాధులు రావడమే కాకుండా చర్మ ఆరోగ్యం కూడా పాడవుతుంది. మరి సిగరెట్ వల్ల చర్మనానికి కలిగే నష్టాలేంటో వివరంగా తెలుసుకుందాం..
- పొగ తాగడం వల్ల రక్త ప్రసరణ దెబ్బతింటుంది. దీంతో రక్తం సరిగా ప్రవహించక.. చర్మం పొడిబారిపోయి నిర్జీవంగా మారుతుంది.
- సిగరెట్ తాగడం వల్ల చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. అలాగే ఫైన్‌లైన్స్ ఎక్కువగా వస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు వస్తాయి.
- పొగ తాగితే చర్మం తాలూకు ఎలాస్టిటీ తగ్గుతుంది. పొగాకులోని నికోటిన్ రక్తంలో చేరి స్కిన్ ఎలాస్టిసీటీపై చెడు ప్రభావం చూపుతుంది.
- స్మోకింగ్ వల్ల సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే రోగ నిరోధక శక్తి క్యాన్సర్ బారిన పడతారు.
ధూమపానంతో ఈ ప్రమాదాలు
- సిగరెట్ తాగిన ప్రతిసారి మీ జీవితంలో 11 నిమిషాలు కోల్పోతారు.
- ఒకసారి పొగ పీలిస్తే 70 రకాల క్యాన్సర్ కారక రసాయనాలు రక్తంలో కలుస్తాయి. వీటి వల్ల ఎక్కువ ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులు ప్రబలుతున్నాయి.
- పొగ తాగే అలవాటు ఉన్న స్త్రీలల్లో అధికంగా గర్భస్రావాలు, నెలలు నిండ కుండానే శిశు జననాలు, శిశు మరణాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.