ఆరోగ్య బీమా తీసుకునే సమయంలో మీకు ఉన్న వ్యాధులను తెలియజేయాలి. మీ ఆరోగ్య పరిస్థితుల గురించి అబద్ధం చెబితే మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ కాంట్రాక్టుల్లో నమ్మకం అనేది చాలా ముఖ్యం. నిజాయితీగా, న్యాయంగా ఉండటం అవసరం.
ముందుగా ఉన్న ఆరోగ్య పరిస్థితుల గురించి చెప్పకపోవడం వలన క్లెయిమ్ తిరస్కరణకు గురై, పాలసీదారులకు అవసరమైన సమయంలో ఆర్థిక అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి ముందుగా ఉన్న పరిస్థితులను బహిర్గతం చేయడం చాలా ముఖ్యం. ఇది కవరేజీని నిర్ణయించడంలో సహాయపడుతుంది. మీ పాలసీ తిరస్కరణకు గురికాకుండా చూస్తుంది.
మీరు చాలా కాలంగా ప్రీమియంలు చెల్లిస్తున్నప్పటికీ పాలసీ తీసుకునే సమయంలో మీరు ముందుగా ఉన్న పరిస్థితులను వెల్లడించకుంటే, మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆస్పత్రి బిల్లు మొత్తం మీరే చెల్లించాల్సి రావొచ్చు. అత్యవసరమైన సమయంలో ఈ పాలసీ మీకు ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అందించకపోవచ్చు. కొంతమంది ప్రీమియంలు పెరుగుతాయని భయపడి ఆరోగ్య బీమాను కొనుగోలు చేసేటప్పుడు వారి హెల్త్ కండీషన్ గురించి అబద్ధాలు చెబుతారు.
ఏదైనా కారణాల వల్ల ముందుగా ఉన్న వ్యాధులను తర్వాత బహిర్గతం చేస్తే అధిక ప్రీమియంలు చెల్లించాల్సిన అవకాశం ఏర్పడవచ్చు. ఇప్పటికే ఉన్న వ్యాధులను బహిర్గతం చేయడం వల్ల పాలసీ వెయిటింగ్ పీరియడ్‌తో వస్తుంది. కొన్ని సందర్భాల్లో బీమా సంస్థ ముందుగా ఉన్న వ్యాధులకు ఖర్చులను కవర్ చేయదు. కాబట్టి ఆరోగ్య బీమా విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.