దెయ్యాల ఉత్సవం.. చూస్తే చలి జ్వరం రావాల్సిందేనట
దెయ్యాల సినిమాలన్నా, కథలన్నా చాలా మంది ఇష్టపడతారు. కొందరైతే ఆ అనుభవాలను పొందాలని సాహసాలు చేస్తుంటారు.
By అంజి Published on 14 April 2024 1:45 PM ISTదెయ్యాల ఉత్సవం.. చూస్తే చలి జ్వరం రావాల్సిందేనట
దెయ్యాల సినిమాలన్నా, కథలన్నా చాలా మంది ఇష్టపడతారు. కొందరైతే ఆ అనుభవాలను పొందాలని సాహసాలు చేస్తుంటారు. అలాంటి వాళ్లు ఈ దెయ్యాల ఉత్సవానికి వెళ్లొచ్చు. మధ్యప్రదేశ్‌లోని మలజ్‌పూర్‌లో ఉన్న ఈ ఆలయాన్ని 'దేవ్జి మహారాజ్ మందిర్'గా పిలుస్తారు. ప్రతి పౌర్ణమి నాడు దెయ్యాల ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఉత్సవం కథేంటో గానీ, దీన్ని చూసినవారికి మాత్రం చలి జ్వరం రావాల్సిందేనట.
ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడికి వచ్చే భక్తులు, ఆడ, మగా బేధం లేకుండా వారిలో దెయ్యం ఉన్నట్టు తమకు తాము ఊహించుకుని, చేతుల్లో కర్పూరాన్ని వెలిగించుకుని ఊరంతా తిరుగుతారు. ఇలా చేయడం వల్ల తమలో, తమ చుట్టూ ఉన్న దుష్టశక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు ఏడాదికోసారి భూత్ మేళ అనే ఉత్సవం పేరుతో గుడి ముందు పెద్ద మంట వేస్తారు. దాంతో చుట్టు పక్కల ఉన్న దుష్టశ్తులు ఆ మంటల్లో చేరి చనిపోతాయని అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం.
ఉత్సవం వెనకున్న కథ..
మలాజ్‌పూర్ దెయ్యాల కథ 18వ శతాబ్దానికి చెందినది. కొన్ని మాయా శక్తుల కలిగిన దేవ్జీ మహరాజ్ ఒకప్పుడు ఈ గ్రామాన్ని సందర్శించారు. అతను మట్టిని బెల్లంగా, రాళ్లుగా మార్చి ప్రజలకు ఇచ్చేవాడట. అంతేకాదు దేవ్జీ తన శక్తితో దుష్టశక్తులను నియంత్రించి, ప్రేతాత్మల పీడలతో బాధపడే ప్రజలకు సహాయం చేసేవాడు. ఈ విధానం కొంత కాలానికి అక్కడ వారసత్వంగా మారింది. తర్వాత కాలం ప్రజలు దేవ్జీకి గుడి కట్టేశారు. పూజారులు దేవ్జీని తమ పూర్వీకులు అని పిలుస్తారు. దుష్టశక్తుల నుండి బయటపడటానికి దేవ్జీ సహాయం చేస్తారని ప్రజలు నమ్ముతారు. ఇక్కడ దేవ్జీ మహారాజ్ సమాధి కూడా ఉంది.