వర్షాకాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

వేసవిలో మండే ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ వర్షాకాలం రానే వచ్చింది. ఈ సీజనల్‌ మార్పు కొన్ని ఆనందాలతో పాటు కొన్ని సీజనల్‌ వ్యాధులను కూడా మోసుకొస్తుంది.

By అంజి  Published on  18 Jun 2024 10:58 AM GMT
rainy season, Rainy Season Precautions, health

వర్షాకాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

వేసవిలో మండే ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ వర్షాకాలం రానే వచ్చింది. ఈ సీజనల్‌ మార్పు కొన్ని ఆనందాలతో పాటు కొన్ని సీజనల్‌ వ్యాధులను కూడా మోసుకొస్తుంది. ఈ కాలంలో ఎవరైనా చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. దోమల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ వైరల్‌ వ్యాధులు, ఆహారం ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్లు వానాకాలంలో ఎక్కువగా ఉంటాయి. అందుకే మన వ్యక్తిగత శుభ్రత, ఇంటి శుభ్రత, ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు మ్యాన్‌ హోల్స్‌, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, ఎలక్ట్రిక్‌ స్తంభాలు, తెగిపడిన విద్యుత్‌ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

భోజనానికి ముందు, బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, వాష్‌రూమ్‌కి వెళ్లి వచ్చిన తర్వాత చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఇంటికి సరఫరా అయ్యే కుళాయి నీళ్లలోకి కొన్నిసార్లు వాన నీటి వల్ల మురికి నీరు చేరే అవకాశం ఉంది. అందుకే ఈ నీటి వినియోగంలో జాగ్రత్త వహించాలి. కూరగాయలను వండే ముందు, పండ్లను తినే ముందు తప్పనిసరిగా నీటితో శుభ్రం చేయాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా చూడాలి. ఇలా కొన్ని రోజుల పాటు నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది.

మలేరియా, డెంగీ వంటి జ్వరాలు దోమల వల్ల వస్తాయి. అందుకే దోమల నిర్మూలనకు మందులు, దోమ తెరలను వాడాలి. వర్షాకాలంలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత కాళ్లు కడుక్కునే ఇంట్లోకి రావాలి. హెర్బల్‌ టీ, వెచ్చని పానీయాలు తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్‌, ఐస్‌క్రీమ్స్‌కు దూరంగా ఉండాలి. బయట జంక్‌ ఫుడ్స్‌ తినకపోవడం మంచిది. స్నానం చేసిన తర్వాత, బయట వర్షంలో తడిసి వస్తే శరీరాన్ని తుడుచుకుని పూర్తిగా ఆరేలా చూసుకోవాలి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

Next Story