వణికిస్తోన్న చలి.. వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. ఈ కాలంలో వృద్ధుల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు
By అంజి Published on 13 Dec 2023 11:10 AM ISTవణికిస్తోన్న చలి.. వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. ఈ కాలంలో వృద్ధుల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వృద్ధులు ఈ చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో చూద్దాం..
వెచ్చని బట్టలు
ఈ చలికాలంలో వృద్ధులు.. వారి శరీరాలను వెచ్చగా ఉంచే బట్టలు ధరించడం మంచిది. అలాగే.. ముఖం, చేతులు, చెవులు, మెడకు స్కార్ఫ్, మంకీ క్యాప్‌లను ధరించాలి.
డీహైడ్రేషన్
చలికాంలో చెమట పట్టదు కాబట్టి.. వృద్ధులు తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీనిని నివారించడానికి విటమిన్ సి, షుగర్ ఫ్రీ జ్యూస్‌లను తరచూ తాగుతూ ఉండాలి.
వ్యాయామం
ఈ కాలంలో వయస్సు మళ్లిన వారి గుండెను వెచ్చగా ఉంచేందుకు కొద్దిపాటి వ్యాయామం చాలా అవసరం. కాబట్టి ఎండపడే ప్రాంతంలో కొంత సమయం వ్యాయామంతో పాటు వాకింగ్ కూడా చేయాలి. వ్యాయామాలు ఎక్కువ సేపు చేయకూడదు. మధ్య మధ్యలో విరామం ఇవ్వడం మంచిది.
సరైన ఆహారం
శీతాకాలంలో వృద్ధులకు విటమిన్లు అధికంగా ఉండే పండ్లను ఆహారంగా ఇవ్వాలి. డ్రై ఫ్రూట్స్, పచ్చి కూరగాయలు, పెరుగు తీసుకోవాలి. ఇవి వారి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
చలి గాలికి తిరగొద్దు
చలి గాలికి ఎక్కువగా తిరగకూడదు. కూల్‌డ్రింక్స్ తీసుకోవద్దు. నాన్‌వెజ్ తీసుకోకుండా ఉంటే మంచిది. గుండె వ్యాధి గ్రస్తులు చలి తీవ్రత లేనప్పుడు, ఎండ వచ్చిన తర్వాతనే ఇండ్ల నుంచి బయటికి రావాలి. కాళ్ల వాపులు ఉన్న వారు చలిలో తిరిగితే ఈ వ్యాధి మరింత ముదిరే ఛాన్స్ ఉంటుంది.
షుగర్, బీపీ ఉన్న వాళ్లు జాగ్రత్త
చలి కాలంలో దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చలి తీవ్రత ఇతర జబ్బులు ఉన్న వారిపైనా ప్రభావం చూపుతుంది. అస్తమా ఉన్న వాళ్లు పొగ తాగకూడదు. పొగ తాగే వారి వద్ద ఉండకూడదు. జాగ్రతలు తీసుకుంటేనే చలి కాలంలో ప్రాణాంతక వ్యాధుల నుంచి బయటపడగలం.