దసరా పండుగ ప్రాముఖ్యత ఇదే
దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కోలాహలంగా జరుపుకునే పండుగ దసరా. దీన్నే విజయదశమి అని కూడా అంటారు.
By అంజి Published on 22 Oct 2023 3:00 AM GMTదసరా పండుగ ప్రాముఖ్యత ఇదే
దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కోలాహలంగా జరుపుకునే పండుగ దసరా. దీన్నే విజయదశమి అని కూడా అంటారు. ఒకప్పుడు లోకాలను పట్టి పీడిస్తున్న భండాసురుడనే రాక్షసుడిని ఆదిశక్తి అవలీలగా వధించిన రోజు.. రాముడు.. రావణుడి పీడను వదిలించిన రోజుగా ముల్లోకాలు ఆనందంతో పండుగ చేసుకునే రోజుగా దసరాను పేర్కొంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని విజయదశమి అని పిలుస్తారు.
రావణ దహనం
రాముడు రావణుడిపై దండెత్తి వెళ్లి విజయం సాధించిన రోజు ఇదే కావడంతో రావణుడి దిష్టిబొమ్మను తగలబెట్టే సంప్రదాయం మొదలైంది. రావణ దహనం వెనక మరో పరామర్థం ఏంటంటే?. పరస్త్రీ వ్యామోహంలో పడిన వారు, వేధింపులకు గురిచేసేవారు ఏదో ఒక రోజు పాపం నుండి దహించుకుపోతారనే సందేశం కూడా ఉందంట. అందుకే మనిషిలో కామ, క్షోధ, మద, మాత్సర్యాలను నశింప చేసుకోవాలని రావణ దహనం సందేశం ఇస్తుంది.
దుర్గాదేవికి 9 అలంకారాలు
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు, పదవ రోజు విజయ దశమి కలిసి దసరా అంటారు. ఆలయాల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కల్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువల్లే అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు.
జమ్మి చెట్టుకు పూజ
దసరా రోజు జమ్మి ఆకులను పూజించి, ఆ తర్వాత పంచుకుంటారని మనందరికీ తెలుసు. మహా భారతంలో పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమీ వృక్షంపై ఉంచారు. తమ అజ్ఞాత వాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమీ వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్లారంట. అజ్ఞాత వాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు శమీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు. అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు. అప్పట్నుంచి విజయ దశమి రోజున శమీ వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది.