నమస్కారం-సెల్యూట్ ఎలా వచ్చాయ్?
ఎదుటివారిని పలకరించాల్సి వస్తే నమస్కారం పెట్టి పలకరిస్తున్నాం. ఎవరినైనా గొప్పగా గౌరవించాలంటే మనమంతా సెల్యూట్ చేసి కృతజ్ఞతలు
By అంజి
నమస్కారం-సెల్యూట్ ఎలా వచ్చాయ్?
ఎదుటివారిని పలకరించాల్సి వస్తే నమస్కారం పెట్టి పలకరిస్తున్నాం. ఎవరినైనా గొప్పగా గౌరవించాలంటే మనమంతా సెల్యూట్ చేసి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నమస్కారం, సెల్యూట్ మనకు ఎలా అలవాటయ్యాయి? వీటికున్న చరిత్రేంటీ? ఇప్పుడు తెలుసుకుందాం.
నమస్కారం
నమస్కారం చేయడం భారత సంస్కృతిలో ఒక భాగం. కేవలం భారత్‌లోనే కాదు.. హిందుత్వ మూలాలు ఉన్న ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ నమస్కారం చేసే సంప్రదాయం ఉంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలను బట్టి.. నమస్కారం, నమస్తే, నమస్కార్ అని అంటుంటారు. ఈ పదాలు సంస్కృతం నుంచి వచ్చాయి. క్రీ.పూ 3000 నుంచి 2000 మధ్య సింధు లోయ నాగరికతపై పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్న సమయంలో నమస్కారం చేసి ఉన్న భంగిమలో ఉన్న అనేక విగ్రహాలను గుర్తించారు. ఈ నమస్కార భంగిమని అంజలి ముద్ర అని పిలుస్తారు. ప్రణమాసన యోగాలో అంజలి ముద్రతో భంగిమ ఉంటుంది.
సెల్యూట్
ఎవరినైనా గొప్పగా గౌరవించాలంటే సెల్యూట్ చేస్తాం. సైన్యంలో సెల్యూట్ చేసే సంప్రదాయం ఎక్కువగా ఉంటుంది. ఈ సెల్యూట్ ఎలా మొదలైందనడానికి చరిత్రకారులు పలు సిద్ధాంతాలను చూపిస్తున్నారు. అవేంటంటే.. అమెరికా సైన్యంలోనే సెల్యూట్ సంప్రదాయం ప్రారంభమైందని యూఎస్ క్వార్టర్ మాస్టర్ స్కూల్ అంటోంది. సైనికులు తమ ఉన్నతాధికారి వచ్చినప్పుడు తమ టోపీని తీసేసేవారట. ఆ తర్వాత బ్రిటన్ సైనికులు కూడా తమ ఉన్నతాధికారులను గౌరవించే సమయంలో తమ టోపీ తీసేవారు. కాలక్రమంలో తలపై టోపీని తీయకుండా కేవలం కుడి చేతితో దానిని తాకి వందనం చేసేవారట. అలా అది ప్రస్తుత సెల్యూట్‌గా రూపాంతరం చెందిందని చెబుతున్నారు.