మనం రోజు తీసుకునే ఆహార పదార్థాలు, పానీయాల ప్రభావం వల్ల నోటిలో బ్యాక్టీరియా, ఇతర వైరస్‌లు వృద్ధి చెందేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇవి పళ్లు, చిగుళ్లకు అంటుకొని ఉంటాయి. సరైన రీతిలో బ్రష్ చేయడం వల్ల మాత్రమే వీటిని మనం తొలగించుకోవచ్చు. అయితే మనం బ్రష్ చేసుకున్న కొన్ని గంటల్లోనే నోటిలో ఇవి మళ్లీ పెరుగుతాయి. అందుకే రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సరిగ్గా పళ్లు తోముకోకపోతే నోటిలో బ్యాక్టీరియా, వైరస్‌లు పెరిగి మన రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తాయి. నోటిలో మంట, చిగుళ్లవాపు, చిగుళ్ల నుంచి రక్తం, నోటి దుర్వాసన వంటి సమస్యలు వస్తాయి. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 2 నిమిషాల పాటైనా బ్రష్ చేసుకోవాలి. అలాగే రోజుకు రెండు సార్లు (ఉదయం, రాత్రి) బ్రష్ చేయాలి.
నోటిని పూర్తిగా శుభ్రం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. ఎప్పుడు బ్రష్ చేసినా.. బ్యాక్టీరియాను తొలగించుకొనే విధింగా నోటిలోని అన్ని భాగాలు కవర్ అయ్యేలా చూసుకోవాలి. దీని వల్ల దంతాల ఆరోగ్యం మెరుగుపడి నోరు శుభ్రంగా ఉంటుంది.