ఉగాది పచ్చడి తయారీకి సన్నగా తరిగిన మామిడి ముక్కలు, కప్పు చింతపండ రసం, అరకప్పు బెల్లం, కొద్దిగా వేప పువ్వు, టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. వీటన్నింటిని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత సరిపడినన్ని నీళ్లు కలిపితే పచ్చడి తయారవుతుంది. పచ్చడిలో కారానికి బదులు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు. రుచి కోసం అదనంగా కొబ్బరి ముక్కలు, వేయించిన పుట్నాల పప్పు కలుపుకోవచ్చు.
ఉగాది రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి దుస్తులు ధరించాలి. దైవ దర్శనం చేసుకుని, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఇళ్లను, వ్యాపార నిలయాలను మామిడి, పూల తోరణాలు, అరటి బోదెలతో అలంకరించాలి. దేవతార్చన, పంచాంగ పూజ చేయాలి. ఉగాది పచ్చడి, భక్ష్యాలు, పూర్ణాలు నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం పంచాగ శ్రవణం, కవిత్వ, సాహిత్య గోష్టుల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది.