అసలు ఒక్క నదీ కూడా లేని దేశాలు ఇవే..!
మనిషి మనుగడకు నీరు ఎంత అవసరమో మనకు తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు బోలెడన్ని నదులతో అలరారే దేశాలుండగా
By అంజి Published on 23 April 2023 7:00 AM GMTఅసలు ఒక్క నదీ కూడా లేని దేశాలివే..!
మనిషి మనుగడకు నీరు ఎంత అవసరమో మనకు తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు బోలెడన్ని నదులతో అలరారే దేశాలుండగా, అసలు ఒక్క నదీ లేని 19 దేశాలు ఉన్నాయంటే నమ్మలేం. అలాంటి దేశాలు, అక్కడి నీటి తిప్పలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
సౌదీ అరేబియా
8,30,000 చదరపు మైళ్ల వైశాల్యంతో 3,42,18,169 జనాభా గల ఈ దేశంలో ఏడాది పొడవునా ఎడారి వాతావరణమే. అయితే.. వందల సంఖ్యలో ఉన్న వాడీ 9o,(రుతుపవనాల వల్ల వాన కురిస్తే పారే వాగులు)లపై ప్రభుత్వం ఆనకట్టలు నిర్మించి నీటిని భద్రపరచి వాడుకుంటోంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
సౌదీ అరేబియా, ఓమన్ పక్కన 32,300 చదరపు మైళ్ల వైశాల్యంతో 92,82,410 జనాభా గల దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ దేశంలో కూడా వాడీలు ఉన్నప్పటికీ అవి అవసరాలకు తీర్చే స్థాయిలో లేవు. భూగర్భ జలాలను సాగుకు వాడుకుంటూనే ఆ వ్యర్థ జలాలను శుభ్రం చేసి ఇతర అవసరాలకు వినియోగిస్తారు.
యెమెన్
అరేబియా ద్వీపకల్పంలో సౌదీ అరేబియాకు దక్షిణాన 2,14,000 చదరపు మైళ్ల వైశాల్యంతో 3,04,91,000 జనాభా గల దేశం యెమెన్. తీవ్ర నీటి ఎద్దడి ఉండే ఈ దేశం రానున్న రోజుల్లో తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కోనుందని నిపుణులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు.
మాల్టా
ఐరోపాలో వాటికన్, మొనాకో తర్వాత నదిలేని దేశం మాల్టా. మధ్యధరా ప్రాంతంలో 122 చదరపు మైళ్ల వైశాల్యంతో 5,16,100 జనాభా గల మాల్టా ప్రముఖ పర్యాటక కేంద్రం. ఈ దీవికి పోటేత్తే పర్యాటకుల మూలంగా నానాటికీ నీటి సంక్షోభం తీవ్రమవుతోంది.
డిజిబౌటి
ఆఫ్రికాకు తూర్పున, ఇథియోపియా, సోమాలియా దగ్గర 8,958 చదరపు మైళ్ల వైశాల్యంతో 9,21,804 జనాభాతో అలరారే దేశం.. డిజిబౌటి. ఈ దేశంలోని 95 శాతం నీటి అవసరాలు భూగర్భ జలాల ద్వారానే తీరుతుండగా, మిగతా 5 శాతం వాడీల నీటితో సరిపెట్టుకుంటున్నారు.
లిబియా
ఇది ఉత్తర ఆఫ్రకాలో 6,79,363 చదరపు మైళ్ల వైశాల్యంతో 69,92,701 జనాభా కలిగిన దేశం. ఈజిప్ట్ - అల్జీరియా మధ్యన ఉంది. వైశాల్యంలో అమెరికాలోని అలాస్కా రాష్ట్రం కంటే పెద్దదైనా నది మాత్రం ఒక్కటీ లేదు. భూగర్భ జలాల మీద ఆధారపడిన ఈ దేశ జనాభా.. 1950 నుండి నేటి వరకు మూడింతలు పెరగడంతో నీటి సమస్య మరింత తీవ్రమవుతోంది.
బహ్రెయిన్
ఇది పర్షియన్ గల్ఫ్‌లో 303 చదరపు మైళ్ల వైశాల్యంతో 15,69,446 జనాభా కలిగిన ద్వీప దేశం. ఇక్కడ 88 శాతం నీరు ఖర్చుతో కూడుకున్న శుద్ధి కేంద్రాల ద్వారా సరఫరా అవుతోంది. ఆవిరితో సాగు యంత్రాలు వాడటం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, నీటి సంక్షేపనం లాంటి ప్రయోగాలను చేపడుతోంది.
కువైట్
పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్, సౌదీ అరేబియా సరసన 6,880 చదరపు మైళ్ల వైశాల్యతో 44,20,110 జనాభా గల దేశమిది. కొన్ని వాడీలు ఉన్నప్పటికీ 93 శాతం నీటి అవసరాన్ని సముద్రపు నీటి నుండి ఉప్పును వేరు చేయడం ద్వారా సమకూర్చుకుంటుంది.
మాల్దీవులు
హిందూ మహా సముద్రంలో 120 చదరపు మైళ్ల వైశాల్యంతో 5,57,426 జనాభా కలిగిన దేశమిది. దిబ్బలు, బీచ్‌లతో కూడిన ఈ దేశానికి పర్యాటకమే ఆధారం. సముద్రజలాల నుంచి నీరు తయారుచేసుకునే ఈ దేశంలో 2004 నాటి సునామీ వల్ల అక్కడి జలాశయాలు కలుషితమైపోయాయి. వేసవి ఎద్దడిలో విదేశాల నుంచి మంచినీరు కొనుగోలు చేస్తుంది.