దీపావళి అంటేనే దివ్వెల పండుగ. ఆ రోజు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్యం పెరుగుతుందనే ఉద్దేశంలో కొందరు పటాసులకు దూరంగా ఉంటారు. మరికొందరు ఏడాదికోకసారి వచ్చే పండుగ రోజున పటాసులు పేలుస్తూ సంతోషంగా గడుపుతారు. అయితే పటాసులు పేల్చే క్రమంలో కొందరు ప్రమాదాలకు గురై గాయపడుతుంటారు. అలా గాయపడే వారికి బీమా కల్పించే ఉద్దేశంతో ఫోన్‌పే ఓ కొత్త తరహా బీమా పాలసీని తీసుకొచ్చింది.
ఈ ప్లాన్ కింద వినియోగదారులు కేవలం రూ.9 ప్రీమియంతో రూ.25 వేల వరకు బీమా కవరేజీని పొందవచ్చని తెలిపింది. అక్టోబర్ 25 నుంచి 10 రోజుల పాటు ఈ బీమా కవరేజీ లభిస్తుందని ప్రకటించింది. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ భాగస్వామ్యంతో తీసుకొచ్చిన ఈ పాలసీలో.. యూజర్ మాత్రమే కాకుండా భార్య పిల్లలు సహా నలుగురు వ్యక్తుల వరకు సమగ్ర బీమా కవరేజీని కూడా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఫోన్ పే యాప్‌లోని ఇన్సూరెన్స్ విభాగంలోకి వెళ్లి ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ ఎంపిక చేసుకుని మీ వివరాలు అందించి పాలసీని కొనుగోలు చేయవచ్చు.