సెల్‌ఫోన్‌ అతిగా వాడితే.. ఈ సమస్యలు తప్పవు

అదే పనిగా ఫోన్‌ స్క్రీన్‌ చూడటం వల్ల కళ్లు పొడి బారడం, అస్పష్టమైన దృష్టి, తలనొప్పి, అలసట వంటి లక్షణాలకు దారి తీస్తుంది.

By అంజి  Published on  3 March 2024 10:47 AM IST
cell phone , health problems, SmartPhone

సెల్‌ఫోన్‌ అతిగా వాడితే.. ఈ సమస్యలు తప్పవు

సెల్‌ఫోన్‌ను అతిగా వాడటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అదే పనిగా ఫోన్‌ స్క్రీన్‌ చూడటం వల్ల కళ్లు పొడి బారడం, అస్పష్టమైన దృష్టి, తలనొప్పి, అలసట వంటి లక్షణాలకు దారి తీస్తుంది. ఫోన్‌ అతిగా వాడితే.. దృష్టి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. చేతిలో ఫోన్ చూడాలంటే మెడ, వెన్నముక ఎక్కువ సేపు వంచాల్సి ఉంటుంది. మొబైల్‌ను ప్రతి రోజూ అదే పనిగా ఎక్కువ సేపు చూస్తూ ఉంటే దీర్ఘకాలిక వెన్నెముక సమస్యలతో పాటు మెడ, వెన్నునొప్పి రావొచ్చు.

సెల్‌ఫోన్‌ను కూర్చొని, పడుకుని ఎక్కువ సేపు పట్టుకొని ఉండటం వల్ల 'సెల్‌ఫోన్‌ ఎల్బో' వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సెల్‌ఫోన్‌ మాట్లాడేటప్పుడు, వాడేటప్పుడు చేతిని ఒకే కోణంలో ఉంచుతాం. దీని వల్ల మోచేయి దగ్గర ఉండే అల్నార్ నరం ఒత్తిడికి గురౌతుంది. దీంతో చేతికి తిమ్మిర్లు వస్తుంటాయి. మణికట్టు నుంచి మొదలు మోచేయి వరకూ నరం నొప్పి వస్తుంది. ఫోన్‌ మాట్లాడేటప్పుడు ఎక్కువ సమయం ఒకే చేతితో పట్టుకోకూడదు.

ఉదయాన్ని లేచిన వెంటనే సెల్‌ఫోన్‌ చూడటం, సోషల్ మీడియాలో అప్‌డేట్‌ కోసం వెతకడం అనేది.. మనకు తెలియకుండానే మన మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు అనేక అధ్యాయనాల్లో తేలింది. ఇది మనలో ఒత్తిడి, ఆందోళన, తెలియని భయం వంటి అనేక సమస్యలకు దారి తీస్తోంది. సోషల్‌ మీడియాలో ఇతరుల పోస్టులకు వచ్చే లైకులు, కామెంట్స్‌ మనకంటే ఎక్కువగా ఉంటే మనల్ని మనం తక్కువగా పోల్చుకోవడం మన మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు తేలింది.

ఫోన్‌ వల్ల ఇప్పుడు ఎలాంటి సమాచారమైనా సెకన్లలో మన ముందు ఉంటోంది. మన కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులతో మాట్లాడే అవకాశం ఉండటం వల్ల వారు దూరంగా ఉన్నారన్న బాధ మనలో లేదు. ఫోన్‌ను అవసరం మేరకు పరిమితంగా వాడితే ఎన్నో లాభౄలు ఉన్నాయి. ఏదైనా సరే అతిగా వాడితే అది ముప్పుగా మారే అవకాశం ఎక్కడైనా ఉంటుంది.

Next Story