Doc talk: హొలీ రంగులతో ఆడాలనుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి
హోలీ ఆడటం ఆనందదాయకంగా ఉన్నప్పటికీ.. తలమీద, చర్మంపై అంటుకున్న రంగులను తొలగించడం చాలా విసుగు తెప్పిస్తుంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 March 2024 12:45 PM ISTDoc talk: హొలీ రంగులతో ఆడాలనుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి
హోలీ ఆడటం ఆనందదాయకంగా ఉన్నప్పటికీ.. తలమీద, చర్మంపై అంటుకున్న రంగులను తొలగించడం చాలా విసుగు తెప్పిస్తుంది! రసాయనాలతో కూడిన రంగులను బలవంతంగా, త్వరగా తొలగించడానికి ప్రజలు డిటర్జెంట్లు, టర్పెంటైన్ నూనెతో సహా అన్ని రకాల పదార్థాలను ఉపయోగిస్తారు. ఏది పడితే అది చర్మం, జుట్టుకు మరింత హాని కలిగిస్తుంది.
హోలీ రంగులను తొలగించడానికి సులభమైన మార్గాలు:
కొన్ని కంపెనీలు ఆర్గానిక్ లేదా నేచురల్ రంగులను విక్రయిస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ, వైద్యులు వాటి వాస్తవికతపై అనుమానం వ్యక్తం చేశారు. నేచురల్ రంగులను కొంచెం ఎక్కువ ధరకు విక్రయిస్తారు. అయితే పువ్వులు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన అసలైన రంగులకు చాలా ఎక్కువ ధర ఉంటుంది. అంతేకాకుండా, రంగులు ఒరిజినల్ అని చెప్పి తనిఖీ చేయడానికి ఎటువంటి యంత్రాలు లేవు. 'సేంద్రీయ' రంగులు కూడా చాలా హానికరం కాకపోయినా, హైపోఅలెర్జెనిక్ కావచ్చు. హోలీ సమయంలో హైపో-అలెర్జీ రంగులతో ఆడిన తర్వాత వచ్చే సాధారణ సమస్యలు.. కాంటాక్ట్ డెర్మటైటిస్, అలెర్జీ, పిగ్మెంటేషన్‌లో మార్పులు (చర్మంపై తెలుపు లేదా ముదురు పాచెస్) కనిపిస్తాయి.
సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌లోని సీనియర్ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ కోట్ల సాయికృష్ణ, హోలీ ఆడే ముందు అనుసరించాల్సిన చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణకు సంబంధించిన వివరాల గురించి మాట్లాడుతున్నారు.
'రంగులతో ఆడుకునే ముందు చర్మంపై కొబ్బరి నూనె రాయండి'
రంగులు మన శరీరం మీద అలాగే ఉండకుండా చేయడానికి సులభమైన మార్గం శరీరంపై కొబ్బరి నూనెను పూయడం. పిల్లలు, పెద్దలు ఇద్దరూ దీనిని పాటించాలి. అలా చేస్తే రంగులు సులభంగా కడిగివేయగలం. నూనెకు బదులుగా, సువాసన లేని వాసెలిన్ లేదా కొంత మాయిశ్చరైజర్ కూడా ఉపయోగించవచ్చు. ఆరుబయట ఆడుతున్నప్పుడు, సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రంగులు సూర్యుడి నుండి వచ్చే UV రేడియేషన్‌ను అడ్డుకోగలవని డాక్టర్ కోట్ల సాయికృష్ణ తెలిపారు.
హోలీ తర్వాత రంగులను కడిగేయడం ఎలా?
సాధారణంగా, హోలీ రంగులు రెండు సార్లు కడిగినా కూడా సులభంగా తొలగించలేము. కానీ రంగులతో ఆడుకునే తీవ్రతను బట్టి దాదాపు ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉండవచ్చు.
డా.సాయికృష్ణ మాట్లాడుతూ ''ఇన్‌స్టెంట్‌గా అన్ని కలర్స్‌ని తొలగించాలని హడావుడి చేయకండి. చర్మం నుండి రంగులను బలవంతంగా తొలగించడానికి సబ్బు, డిటర్జెంట్, టర్పెంటైన్ నూనెను ఉపయోగించవద్దు. వీటిని వాడితే చర్మం మరింత పొడిగా మారుతుంది. రంగులు ఎక్కువసేపు అతుక్కోవచ్చు. మృదువైన స్నానపు సబ్బు లేదా బేబీ షాంపూ, నీటితో చర్మాన్ని సున్నితంగా శుభ్రపరచండి. రంగు వెళ్లిపోయే వరకు ప్రతిరోజూ ఇలా చేస్తూ ఉండండి. స్నానం చేసిన తర్వాత, సాధారణ మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి." అని తెలిపారు
జుట్టుకు సంరక్షణ
“తలమీద రంగులు లోతుగా చొచ్చుకుపోనప్పటికీ, చికాకు, దురద, ఎరుపు, వాపు వంటివి కలిగించవచ్చు. రంగులు తలమీద ఎక్కువసేపు అతుక్కుపోకుండా.. నివారించడానికి, హోలీ ఆడటానికి ఒక రోజు ముందు.. జుట్టును షాంపూ, కండీషనర్‌తో శుభ్రం చేసి, ఆపై కొబ్బరి నూనె వంటి హెయిర్ ఆయిల్‌ను అప్లై చేసుకోవాలి. పొడవైన జుట్టు ఉంటే ఆడుకునే ముందు జుట్టును కట్టుకోండి. నూనె పూయడం వల్ల క్యూటికల్‌పై రక్షిత పొర ఏర్పడుతుంది. ఈ చర్యలు జుట్టుకు నష్టాన్ని నివారిస్తాయి. ”అని డాక్టర్ సాయి కృష్ణ తెలిపారు.
“హోలీ ఆడిన తర్వాత, అన్ని రంగులు తొలగిపోయే వరకు ప్రతిరోజూ ఒక సారి సల్ఫేట్ లేని షాంపూ లేదా బేబీ షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోండి. ఒకే రోజు పదే పదే కడిగేయాలని ప్రయత్నించకండి. కడిగిన తర్వాత జుట్టును బ్లో డ్రై చేయడాన్ని నివారించండి, కానీ టవల్‌తో మెల్లగా తుడవండి. రంగులు వెళ్లిపోయే వరకు కొన్ని రోజుల పాటు జుట్టుకు రంగు వేయడం లాంటి పనులను ఆపుకోండి" అని తెలిపారు.
రసాయన రంగులతో ఆడకుండా చూసుకోండి:
మొటిమలు, తామర, అటోపిక్ డెర్మటైటిస్, సోరియాసిస్ వంటి చర్మసంబంధమైన సమస్యలు ఉన్నవారు రసాయన రంగులతో ఆడటం మానుకోవాలని డాక్టర్ సాయి కృష్ణ సలహా ఇచ్చారు. ఇది చర్మ సమస్యలు మరింత పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. బ్రోన్చియల్ ఆస్తమా, అలర్జిక్ రినైటిస్ ఉన్నవారు రంగులతో ఆడాలనుకుంటే జాగ్రత్తగా ఉండాలి. బంగారు, వెండి రంగులతో ఆడకుండా ఉండటం కూడా మంచిది.