న్యూ ఇయర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. నేటితో 2023కు గుడ్‌బై చెప్పి.. రేపు 2024లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం.

By అంజి  Published on  31 Dec 2023 4:00 AM GMT
New Year, New Year 2024, UNO, New Zealand

న్యూ ఇయర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. నేటితో 2023కు గుడ్‌బై చెప్పి.. రేపు 2024లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అసలు నూతన సంవత్సరం వేడుకలు ముందుగా ఎక్కడ మొదలై.. ఎక్కడ ముగుస్తాయి. ఈ వేడుకలను మొదటగా ఎవరు ప్రారంభించారో తెలుసుకుందాం..

ఐక్యరాజ్యసమితి గుర్తించిన దాదాపు 195 దేశాల్లో జనవరి 1ని కొత్త ఏడాదిగా జరుపుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే.

కొత్త ఏడాదికి స్వాగతం పలికేది ఈ దేశమే..

సూర్యుడు తొలుత ఉదయించే నేల కాబట్టి కొత్త ఏడాదికి జపాన్‌ ముందుగా స్వాగతం పలుకుతుందని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు, అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఏర్పాటు చేసిన టైమ్‌ ఆధారంగా తేదీ మారుతుంది. అలా ముందుగా 12.00 గంటల సమయం మొదట ఎక్కడ మొదలవుతుందో ఆ ప్రాంతం నుంచి ఈ వేడుకలు మొదలవుతాయి. అలా న్యూజిలాండ్‌ దేశ రెండో రాజధాని ఆక్లాండ్‌తో పాటు టోంటా, సమోవా, కిరిబాటి పసిఫిక్‌ ఐలాండ్స్‌ ప్రజలు కొత్త ఏడాదికి ముందుగా స్వాగతం పలుకుతారు. అప్పుడు మన దేశంలో సమయం డిసెంబర్‌ 31, సాయంత్రం 4.30 అవుతుంది. అలా ఆ దేశాల్లో స్వాగతం పలికాక ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌ ఒక్కో దేశాన్ని దాటిన న్యూఇయర్‌కి.. అమెరికాలోని హోల్యాండ్‌, బేకర్‌ ఐలాండ్‌ చివరగా స్వాగతం పలుకుతాయి. ఈ ఐలాండ్స్‌ న్యూఇయర్‌కి స్వాగతం పలికేటప్పుడు మన దేశంలో సమయం జనవరి 1, సాయంత్రం 5.30 గంటలు అవుతుంది.

కొత్త ఏడాది వేడుకలకు పుట్టినిల్లు..

అతి పురాతన మెసపటోమియా ఇప్పటి ఇరాక్‌లో న్యూఇయర్‌ 'అకితూ' అనే పండుగతో మొదలైందని చరిత్ర చెబుతోంది. దీన్ని దాదాపు 12 రోజులు నిర్వహించేవారు. క్రీ.పూ 2000 క్రితం వసంతరుతువు ముగిశాక మొదటి అమావాస్య రోజున పగలు, రాత్రి సమానంగా ఉండే రోజున ఈ వేడుకలు నిర్వహించేవారు. ఇస్లామిక్‌ దేశాల్లో మొహర్రంని కొత్త సంవత్సరంగా జరుపుతారు. చైనాలో శీతాకాలం ముగిశాక రెండో అమావాస్యను కొత్త ఏడాదిగా జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో జరుపుకుంటారు. నేపాల్‌లో ఏప్రిల్‌ 14న కొత్త ఏడాది వేడుకలు చేసుకుంటారు. యూదులు సెప్టెంబర్‌ 25 నుంచి 27 సాయంత్రం వరకు న్యూఇయర్‌ వేడుకలు జరుపుతారు.

భారత్‌లో కొత్త సంవత్సరం

తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, గోవాలోని కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయ పద్ధతిలో షడ్రుచుల కలయికతో ఉగాదిని నూతన సంవత్సరంగా నిర్వహిస్తారు. తెలుగువారితో పాటు ఇదే రోజున మరాఠీలు 'గుడిపడ్వా', తమిళులు 'పుత్తాండు', మలయాళీలు 'విషు', సిక్కులు 'వైశాఖీ', బెంగాలీలు 'పోయ్‌ లా బైశాఖ్', బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో చైత్ర నవరాత్రిగా, గుజరాత్‌లో అక్టోబర్‌ నెలలో 'నూతన వర్ష్‌'గా నూతన సంవత్సరాదిని చేసుకుంటారు. కొన్ని సంప్రదాయ మార్వాడీ కుటుంబాలు దీపావళిని నూతన ఏడాదిగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఒడిశాలో ఏప్రిల్‌లో విశువ సంక్రాంతి లేదా పన సంక్రాంతిగా జరుపుతారు.

Next Story