సాధారణంగా ఇంట్లో తరచూ డీఫ్రాస్ట్ చేసినా ఫ్రీజ్‌లో ఐస్ పేరుకుపోవడం గమనిస్తూనే ఉంటాం.. ఈ సమస్య ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఉంటారు. కొన్నిసార్లు ఆ ఐస్ కరిగేందుకు రిఫ్రిజిరేటర్‌ను ఆఫ్ చేస్తుంటారు. అయితే.. ఇలా చేయడం వల్ల ఐస్ త్వరగా కరిగి నీళ్లు ఫ్రిజ్ నుంచి కారడంతో ఇల్లంతా తడిగా మారి, దుర్వాసన వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. అప్పుడప్పుడు టెంపరేచర్ కంట్రోలర్ వద్ద ఉండే బటన్ నొక్కితే ఫ్రిజ్ ఆఫ్ అవ్వకుండానే క్రమంగా గడ్డకట్టిన ఐస్ కరిగిపోతుంది. కానీ తరచూ ఇలా జరుగుతుంటే మాత్రం సమస్యగా గుర్తించాల్సిందే.
ఇలా ట్రై చేసి చూడండి..
డీఫ్రిజ్‌లోని గోడలు కొద్దిపాటి గడ్డలు కడితే పర్లేదు కానీ.. అందులో వేరేవి పెట్టలేనంత నిండిపోతే మాత్రం.. ఫ్రిజ్ నిర్వహణ సరిగా లేదని అర్థం. ఏ వస్తువైనా మనం ఉపయోగించే తీరును బట్టే దాని మన్నిక ఆధారపడి ఉంటుంది.
ఫ్రిజ్ డోర్‌కు ఉండే రబ్బరు పట్టీ పాడవ్వటం, వదులుగా మారడంతో బయటిగాలి లోపలికి వెళ్లి తేమగా మారి ఐస్ అవుతుంది. ఫ్రిజ్ కొనుగోలు చేసి చాలా కాలం అవుతుంటే రబ్బరు పట్టీని తీసేసి కొత్తది వేయించడం మంచిది.
నీటిని శుభ్రపరిచే వాటర్ ఫిల్టర్, గ్యాస్ సిలిండర్ సరిగా పనిచేయకపోయినా ఐస్ గడ్డ కడుతుంది. దీంతో ఫ్రిజ్‌లో ఉన్న వస్తువులు అన్నీ మంచులో కూరకుపోతాయి. ఈ సమస్య ఎక్కువ ఉంటే.. ఓసారి టెక్నీషియన్‌కు చూపించాలి.