వేసవి ధాటికి దూరంగా.. మనసుకు ఉపశమనం కలిగించే చల్లని ప్రదేశంలో గడపాలని ఉందా? ఆకుపచ్చని లోకంలో ఆనందంగా విహరించాలని ఉందా? కొండలను చీల్చుకుంటూ నేలవైపు పరుగులు తీసే జలపాతాల పరవళ్లను చూస్తూ పరవశించాలని ఉందా? అయితే చలో కూనూర్.. అక్కడి విశేషాలు ఏంటో తెలుసుకుందాం.. రండి..
ఊటీకి కూతవేటు దూరంలోనే ఉన్న అతిపెద్ద హిల్ స్టేషన్ కూనూర్. నీలగిరి కొండల నడుమ వెలసిన చిన్న పట్టణం ఇది. ప్రత్యేకమైన వాతావరణం, విభిన్న రకాల పూలు, పక్షులకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఎటు చూసినా తేయాకు తోటల పచ్చదనం.. సముద్ర మట్టానికి దాదాపు 6 వేల అడుగుల ఎత్తులో ఉన్న చల్లచల్లని ప్రశాంత ప్రదేశం కూనూర్.
కూనూర్‌లోని 'సిమ్స్ పార్క్' చూసి తీరాల్సిన ప్రదేశం. ఈ పార్కులో ఏడాదికోసారి జరిగే పండ్లు, కూరగాయల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. కూనూర్‌కు 10 కి.మీ దూరంలో ఉన్న 'డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్' నుంచి చూస్తే చుట్టూ పచ్చని తేయాకు తోటలు సహా నీలగిరుల అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. కూనూర్ నుంచి 8 కి.మీ దూరంలోని 'ల్యాంబ్స్ రాక్' కూడా మరో అద్భుతమైన వ్యూ పాయింట్. కూనూర్‌కు 7 కి.మీ దూరంలోని 'లాస్ జలపాతం' చూసి తీరాల్సిన ప్రదేశం. ఇది నీలగిరి కొండల మీదుగా దాదాపు 180 అడుగుల ఎత్తు నుంచి ఉరకలేస్తూ పరవళ్లు తొక్కుతూ ఉంటుంది.