మనుషుల్లో సాధారణంగా ఉండే ఫోబియాలేంటో తెలుసా?
ప్రతి ఒక్కరికి కొన్ని భయాలుంటాయి. మనిషి లోపల ఎక్కడో ఆ భయాలు నాటుకుపోయి.. సందర్భాన్ని బట్టి
By అంజి Published on 29 March 2023 11:15 AM GMTమనుషుల్లో సాధారణంగా ఉండే ఫోబియాలేంటో తెలుసా?
ప్రతి ఒక్కరికి కొన్ని భయాలుంటాయి. మనిషి లోపల ఎక్కడో ఆ భయాలు నాటుకుపోయి.. సందర్భాన్ని బట్టి బయటపడతాయి. భయానికి శాస్త్రీయ నామమే ఫోబియా. ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో సాధారణంగా కొన్ని ఫోబియాలు ఉంటాయట. అవేంటో తెలుసుకుందాం..
ఒపిడియో ఫోబియా - పామును చూడగానే చాలా మంది భయపడుతారు. దీన్ని ఒపిడియో ఫోబియా అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉంటుంది. పాము కరిస్తే విషమెక్కి చనిపోతామన్నా ఆలోచనే.. ఈ భయాన్ని పెంచుతుందట.
అక్రో ఫోబియా - ఎత్తైన ప్రదేశాలకు వెళ్లడానికి భయపడే వారిని, లోతైన ప్రాంతాలను చూసి దడుచుకునే వారిని మీరు గమనించే ఉంటారు. అలాంటి వారికి అక్రో ఫోబియా ఉందని అర్థం.
కైనో ఫోబియా - కుక్కలను చూడగానే భయపడి పారిపోయే వ్యక్తులు నిత్యం కనిపిస్తుంటారు. ఇలా కుక్కని చూసి భయపడటాన్నే కైనో ఫోబియా అంటారు. చిన్నతనంలో కుక్క కరవడం లేదా వెంటపడటం వంటి సంఘటనలు జరిగి ఉంటే... అవి మనిషి మెదడులో ముద్రపడిపోయి భయంగా మారిపోతుందట.
అరాక్నో ఫోబియా - సాలె పురుగును చూసి చాలామంది భయపడుతుంటారు. అరాక్నిడ్ ఫ్యామిలీకి చెందిన పురుగులను చూసినా భయమేస్తుంటుంది. అందుకే ఈ భయాన్ని అరాక్నో ఫోబియా అంటారు. ఈ ఫోబియా ఉన్నవారు సాలె పురుగులను నేరుగానే కాదు.. వాటి చిత్రాన్ని చూసినా భయపడి పోతుంటారు. నిజానికి ఈ భయం ఆదిమానువులుగా ఉన్నప్పట్నుంచి ఉంది. ఎందుకంటే ఆ కాలంలో సాలె పురుగులను దగ్గరకు రాకుండా ఎలా వెళ్లగొట్టాలో తెలియక వాటిని చూసి మనుషులు భయపడిపోయేవాళ్లట. అలా ఆ భయం మనిషిలో నాటుకుపోయిందని నిపుణులు చెబుతున్నారు.
నియో ఫోబియా - నియో ఫోబియా ఉన్నవాళ్లు కొత్త విషయాలను అసలు స్వీకరించలేరు. కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి, కొత్త విషయం నేర్చుకోవడానికి, కొత్త మనుషులతో మాట్లాడటానికి ఇష్టపడరు.
ట్రైపనో ఫోబియా - కొంతమంది ఇంజక్షన్ చేయించుకోవడానికి భయపడటం చూస్తూ ఉంటాం. దీనిని ట్రైపనో ఫోబియా అంటారట. ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మంది ఈ ఫోబియాను కలిగి ఉన్నారట.
సోషియో ఫోబియా - కొంతమంది సమాజంలో కలివిడిగా ఉండలేరు. పార్టీలు, సమావేశాలు వంటి ఎక్కువమంది ఉండే ప్రాంతాలకు వెళ్లడానికి అసలు ఇష్టపడరు. ఈ సోషియో ఫోబియా ఉన్నవాళ్లు ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా తమనే గమనిస్తున్నారేమో, తమ గురించే మాట్లాడుకుంటున్నారెమోనని అనుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ఫోబియాగా గుర్తించాలి. ఇలాంటి సమస్య ఉన్నవారికి చికిత్స అవసరం.