వీలునామా రాసేటప్పుడు వీడియో తీయవచ్చా?
ఆస్తులు ఉన్న వారికి వీలునామా అనేది ఎస్టేట్ ప్లానింగ్‌లో కీలకమైన, చట్టపరమైన పత్రం. దీని ద్వారా ఒక వ్యక్తి మరణించిన తర్వాత తన ఆస్తులను ఎలా పంపిణీ చేయాలనుకుంటున్నారో తెలియజేయవచ్చు.
By అంజి
వీలునామా రాసేటప్పుడు వీడియో తీయవచ్చా?
ఆస్తులు ఉన్న వారికి వీలునామా అనేది ఎస్టేట్ ప్లానింగ్‌లో కీలకమైన, చట్టపరమైన పత్రం. దీని ద్వారా ఒక వ్యక్తి మరణించిన తర్వాత తన ఆస్తులను ఎలా పంపిణీ చేయాలనుకుంటున్నారో తెలియజేయవచ్చు. ఇది వారసుల మధ్య విభేదాలు, లీగల్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. వీలునామా విషయంలో మరో కీలకమైన అంశం వీడియో. ఈ ప్రాసెస్‌లో సంబంధిత వ్యక్తి వీలునామా అంశాలను వివరిస్తుండగా కెమెరాతో వీడియో రికార్డ్ చేస్తారు. ఇది క్లారిటీ, అథెంటిసిటీ ఇవ్వడమే కాకుండా, చట్టపరమైన వివాదాలకు పరిష్కారాన్ని కూడా అందిస్తుంది. వీలునామా తరహాలోనే, వీడియోగ్రాఫ్డ్ వీలునామాకు కూడా సరైన ప్లానింగ్ అవసరం. టెస్టేటర్ ఆస్తులు, పెట్టుబడులు, వ్యక్తిగత వస్తువుల సహా అన్ని ఆస్తులను లిస్ట్ చేయాలి. అయితే వీడియోగ్రఫీ వీలునామా ఉన్నప్పటికీ, లీగల్ డాక్యుమెంట్ రూపంలో రాసిన వీలునామా కూడా అవసరం. ఇది కోర్టుల్లో ఆమోదం పొందుతుంది. వీడియోగ్రాఫ్ చేసిన వీలునామాకు రిఫరెన్స్ పాయింట్‌గా మారుతుంది.
ఈ జాగ్రత్తలు అవసరం
రికార్డింగ్ సెషన్ సమయంలో టెస్టేటర్ తన నిర్ణయాలను వివరిస్తూ తన పేరు, తేదీ, వీలునామాలోని విషయాలను స్పష్టంగా పేర్కొనాలి. మంచి లైటింగ్, క్లియర్ ఆడియో, ప్రశాంతమైన వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రాతపూర్వక వీలునామా, వీడియోగ్రాఫ్ చేసిన వీలునామాలకు కూడా సాక్షులు ఉండాలి. రికార్డ్ చేసిన తర్వాత, వీడియో ఫైల్‌ను రాతపూర్వక వీలునామాతో పాటు లాయర్ లేదా విశ్వసనీయ సంస్థ/ వ్యక్తుల వద్ద జాగ్రత్త చేయాలి. భారతీయ వారసత్వ చట్టం, 1925.. వీడియోగ్రాఫ్ చేసిన వీలునామాలను స్పష్టంగా పేర్కొనలేదు. అయితే కోర్టులు వీటిని అనుబంధ సాక్ష్యంగా గుర్తించాయి. ఇది ఇప్పటికే రాసిన వీలునామా విశ్వసనీయతను బలపరుస్తుంది. అయితే ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి ముందు వీలునామాలు, ఎస్టేల్ ప్లానింగ్‌లో నిపుణుడైన లాయర్ సలహా తీసుకోవడం మంచిది.