రీ సేల్ ప్రాపర్టీ కొంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే
చిన్నదైనా సరే సొంతిల్లు ఒకటి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
By అంజి Published on 3 Nov 2024 1:30 PM ISTరీ సేల్ ప్రాపర్టీ కొంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే
చిన్నదైనా సరే సొంతిల్లు ఒకటి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో పెరిగిన ధరలతో భూములు, ఇళ్లు అందని ద్రాక్షగా మారాయి. దీంతో సొంతింటి కల నెరవేర్చుకొనేందుకు చాలా శ్రమిస్తున్నారు ప్రజలు. అయితే ఇది అంత సులువు కాదు. కోరుకున్న లోకేషన్‌లో ఇల్లు దొరకడం, అదీ బడ్జెట్‌లో దొరకడం చాలా కష్టం. అందుకే చాలా మంది ఈ విషయంలో తప్పక రాజీపడి.. ఊరికి దూరంగా లేదా కాస్త వెనుకబడిన ప్రాంతంలో ఇల్లు కొనుక్కోవడం చేస్తుంటారు. ఇలా రాజీపడాల్సిన పని లేదు. ఇటువంటి నేపథ్యంలో కొత్త ఇల్లు కంటే రీ సేల్ ప్రాపర్టీ కొనడం మంచి ఆప్షన్. సాధారణంగా ఓల్డ్ ప్రాపర్టీ లేదా సెకండ్ హ్యాండ్ హోమ్‌ను రీసేల్ ప్రాపర్టీ అంటారు. ఇందులో ఉండే సౌలభ్యం ఏమిటంటే ఇల్లు కొనుక్కున్న వెంటనే ఆక్యుపై చేసుకోవచ్చు. కావలసిన ప్రదేశంలో ఇల్లు దొరుకుతుంది.
ఈ జాగ్రత్తలు అవసరం
కొత్త ఇల్లు కొనుక్కునే సమయంలో వచ్చే ఇబ్బందులు రీ సేల్ ప్రాపర్టీ కొనేటప్పుడూ వస్తాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మొదటగా రీ సేల్ ప్రాపర్టీ ఏజ్ చూడాలి. ఇందుకు స్ట్రక్చరల్ ఇంజనీర్ సహాయం తీసుకోవాలి. ఇంటికి ఎంత బలం ఉంది అనే విషయాన్ని లెక్కిస్తారు. లేదంటే రెన్నోవేషన్ కాస్ట్ ఎక్కువైపోతుంది. అక్కడ ఉన్న రీ సేల్ మార్కెట్ వాల్యూ, ఇంటి వయసు అన్నింటినీ పరిశీలించి, అన్నీ సరిగ్గా కుదిరిన తర్వాత చేయాల్సిన పని డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవడం.
ఇంటి యజమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, టైటిల్ డీడ్ ఇలా అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించాలి. ఇంటిపై ఏదైనా లోన్ ఉందేమో చెక్ చేసుకోవాలి. మెయింటనెన్స్ ఛార్జీలు, ఎలక్ట్రిక్ ఛార్జీలు లేదా ఇతర రకాలైన ఏవైనా బకాయిలు ఉన్నాయేమో స్పష్టంగా తెలుసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా కచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాపర్టీనే ఎంచుకోండి. రిజిస్ట్రేషన్ లేని ప్రాపర్టీలు చాలా తక్కువ ధరలో అందుబాటులోకి వస్తాయి. దానిలో చాలా రిస్క్ ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది.