యావ‌జ్జీవ శిక్ష ప‌డ్డ ఖైదీలు నడుపుతున్న కేఫ్ చూశారా?

A Shimla cafe run by prisoners. అందమైన పర్వతాలు, పచ్చదనం, సుందరమైన ప్రకృతి దృశ్యాలను చూస్తూ చల్లని వాతావరణంలో వేడి వేడి కప్పు కాఫీని

By అంజి  Published on  17 July 2022 11:40 AM GMT
యావ‌జ్జీవ శిక్ష ప‌డ్డ ఖైదీలు నడుపుతున్న కేఫ్ చూశారా?

అందమైన పర్వతాలు, పచ్చదనం, సుందరమైన ప్రకృతి దృశ్యాలను చూస్తూ చల్లని వాతావరణంలో వేడి వేడి కప్పు కాఫీని అస్వాదించడం ఒక ప్రత్యేకమైన అనుభవం అని చెప్పుకోవచ్చు. అలాంటి ఓ ప్రదేశం గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడి పని చేసేవారు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఈ కేఫ్‌లో పని చేసేది సాధారణ వ్యక్తులు కాదు.. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలు. హిమాచల్ ప్రదేశ్ జైళ్ల శాఖ రూపొందించిన ఈ కేఫ్‌ను జీవిత ఖైదు అనుభవిస్తున్న నలుగురు ఖైదీలు నిర్వహిస్తున్నారు. ఈ కేఫ్‌ను మీరూ చూడాలనుకుంటే.. తప్పకుండా సిమ్లా వెళ్లాల్సిందే.


ఈ కేఫ్‌ను సిమ్లాలోని ఒక కొండపై 'బుక్ కేఫ్' పేరుతో ఏర్పాటు చేశారు. ఇక్కడి ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. కాఫీతో పాటు ఎన్నో రకాల స్నాక్స్, డిలిషియస్ డ్రింక్స్‌ ఇక్కడ దొరుకుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా సిమ్లా సమీపంలోని కైతుజైల్‌లో ఉన్న నలుగురు జీవిత కాల ఖైదీలు ఈ కేఫ్‌ను నిర్వహిస్తుండటం విశేషం. ఈ కేఫ్‌లో పేరుకు తగ్గట్టే ఒక మినీ లైబ్రరీ కూడా ఉంది. ఇక్కడ మీరు నచ్చిన పుస్తకాన్ని తీసుకుని హాయిగా కాఫీ లేదా స్నాక్స్ తింటూ చదువుకోవచ్చు. ఈ కేఫ్‌లో 40 మంది కూర్చునేంత స్థలం ఉంది. ఈ కేఫ్‌లో ఉచిత వైఫై సదుపాయం కూడా ఉంది. బుక్‌ కేఫ్‌ను ప్రతి రోజు ఉదయం 10 గంటలకు తెరిచి రాత్రి 9 గంటలక మూసివేస్తారు.

ఈ కేఫ్‌కు హిమాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ నిధులు సమకూరుస్తోంది. ఖైదీలకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ కేఫ్ నిర్మించబడింది. దీని ప్రారంభోత్సవానికి దాదాపు 20 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇక్కడ పనిచేస్తున్న ఖైదీలు జై చంద్, రామ్ లాల్, రాజ్ కుమార్, యోగ్ రాజ్‌లు ఓ ప్రఖ్యాత హోటల్ ద్వారా అధికారికంగా శిక్షణ పొందారు. అందుకే వారు కస్టమర్‌లకు బాగా సర్వీస్ చేయగలుగుతున్నారు. రాత్రి 9 గంటలకు కేఫ్ మూసివేసిన తర్వాత ఈ నలుగురు ఖైదీలు తిరిగి జైలుకు వెళ్తారు.

బుక్ కేఫ్‌కి ఎలా చేరుకోవాలి?

విమానం ద్వారా: మీరు నేరుగా సిమ్లా ఎయిర్‌పోర్టు నుంచి క్యాబ్‌ను అద్దెకు తీసుకొని వెళ్లొచ్చు. కేఫ్, ఎయిర్‌పోర్టు మధ్య దూరం 25 కిమీ మాత్రమే. ఎయిర్‌పోర్టు నుంచి కేఫ్‌ను చేరుకోవడానికి గంట సమయం పడుతుంది. అలాగే సిమ్లా రైల్వే స్టేషన్‌ నుంచి కేఫ్ మధ్య దూరం 8 కి.మీ మాత్రమే. బుక్ కేఫ్‌కు మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు.

Next Story