విశాఖ: ఎల్జీ పాలిమర్స్ వద్ద మృతదేహాలతో ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత
By సుభాష్ Published on 9 May 2020 9:47 AM GMTవిశాఖలో 12 మంది మృతి, వందలాది మంది ఆస్పత్రి పాలవడానికి కారణమైన
విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది.తమకు న్యాయం చేయాలంటే మృతదేహాలతో పరిశ్రమ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. అయితే ఆందోళన కొనసాగుతున్న సమయంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గ్యాస్ లీకైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు ఒక్కసారిగా దూసుకెళ్లారు. పరిశ్రమ గేట్లను మూసివేసి ఆందోళనకారులను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నప్పటికీ ఆందోళకారులు ఎంతకి ఆగలేదు. గేట్లు తోసివేసి లోపలికి ప్రవేశించారు.
ఈ క్రమంలో కొందరు మహిళలు డీజీపీ కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎల్జీ పాలిమర్స్‌ను అక్కడి నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఆందోళన కారులతో పరిశ్రమ వద్ద మరింత ఆందోళన నెలకొంది.
గ్యాస్ లీకైన ప్రదేశాన్ని పరిశీలించిన డీజీపీ అనంతరం అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నించగా, ఆందోళనకారులు అడ్డుకున్నారు. సంయమనం పాటించాలని పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆందోళనకారులు శాంతించలేదు. పరిశ్రమ పరిసరాల పరిస్థితిని నగరపోలీస్ కమిషనర్ ఆర్కే మీనా పర్యవేక్షించారు.
తమకు న్యాయం జరగాలి
తమకు న్యాయం జరిగే వరకూ మృతదేహాలతో ఆందోళన కొనసాగిస్తామని ఐదు గ్రామాల ప్రజలు తేల్చి చెప్పారు. ఘటన జరిగి రెండు రోజులవుతున్నా.. ఇప్పటి వరకూ కంపెనీ యాజమాన్యం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. ప్రమాదంపై పరిశ్రమ యాజమాన్యం ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
కాగా, పరిశ్రమలో గ్యాస్ లీకేజీ కారణంగా 12 మంది వరకూ మృతి చెందగా, వందలాది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్ననారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన హైపర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి ప్రభుత్వానికి నివేదించనుంది. నెల రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనుంది.