ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం.. సంచలన విషయాలు వెలుగులోకి
By సుభాష్ Published on 7 July 2020 9:01 AM GMTవిశాఖపట్నంలోని గోపాలపట్నంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థలో స్టెరీన్ గ్యాస్ లీక్ అయి 12 మంది ప్రాణాలు కోల్పోయిన దారుణ ఉదంతం చోటు చేసుకుని అప్పుడే రెండు నెలలు కావస్తోంది. కొన్ని రోజుల పాటు చర్చనీయాంశం అయిన ఈ విషాదాంతం గురించి తర్వాత అందరూ మరిచిపోయారు. ఐతే ఇప్పుడు మళ్లీ ఆ ఘటన వార్తల్లోకి వచ్చింది. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ.. తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ దుర్ఘటనకు సంబంధిచి 11 భాగాలతో 4 వేల పేజీల నివేదికను కమిటీ ప్రభుత్వానికి అందజేసింది. పన్నెండు మంది ప్రాణాలు పోవడంతో పాటు వందల మంది అస్వస్థతకు గురయ్యేలా చేసిన ఈ ప్రమాదానికి సంబంధించి కొన్ని రోజుల కిందటే సంకేతాలు కనిపించినప్పటికీ ఎల్జీ పాలిమర్స్ సంస్థ జాగ్రత్త పడటంలో విఫలమైందని ఈ నివేదికలో పేర్కొన్నట్లు కమిటీ తేల్చింది.
మే 7న ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. అంతకు రెండు వారాల ముందు.. అంటే ఏప్రిల్ 24న స్టెరీన్ ట్యాంకుల్లో పాలిమర్స్ పరిమాణం అసాధారణంగా పెరుగుతున్నట్లు సంస్థ ప్రతినిధులు గుర్తించారట. అయితే దాన్ని ప్రమాద హెచ్చరికగా పరిగణించలేదట. అప్పుడే తగిన నియంత్రణ చర్యలు చేపట్టి ఉంటే ఆ ప్రమాదం చోటు చేసుకునేదే కాదని కమిటీ అభిప్రాయపడింది. గ్యాస్ లీక్ అయిన ఎమ్-6 స్టైరీన్ ట్యాంక్ పైపింగ్‌ను ఎవరికీ చెప్పకుండా గత ఏడాది డిసెంబరులో ఆ సంస్థ మార్చేయటంతో సర్క్యులేషన్, మిక్సింగ్ వ్యవస్థలు దెబ్బతిన్నాయని.. ఈ దుర్ఘటనకు అప్పుడే బీజం పడిందని కూడా కమిటీ తేల్చింది.
సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ప్రకారం రాత్రి 2.45 సమయంలో ట్యాంకు నుంచి సైరీన్ ఆవిర్లు వెలువడగా.. ఉదయం 5.15 వరకూ కంపెనీ వాటి నియంత్రణకు చర్యలు చేపట్టలేదు. ఆ తర్వాత నీళ్లు చల్లారు. అయితే ఆవిరి రూపంలోకి మారిన స్టైరీన్‌ను తటస్థీకరించేందుకు అవసరమైన రసాయనాల నిల్వలు లేవు. అవి ఉంటే మధ్యాహ్నానికల్లా ఆవిర్లు నియంత్రించేందుకు అవకాశం ఉండేది. రాత్రి 10 గంటల సమయంలో రెండోసారి ఆవిర్లు వచ్చేవి కాదు. మొత్తంగా చూస్తే ఈ విషాదంలో ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఆ సంస్థపై మెతకగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ సర్కారు.. కమిటీ నివేదికను అనుసరించి ఎలాంటి చర్యలు చేపడుతుందో.. బాధితులకు ఎలా న్యాయం చేస్తుందో చూడాలి.