ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన జీవి ఏదైనా ఉందా అంటే.. అది ‘మనిషే’..! మనిషి తన మనుగడ కోసం ఏ జీవినైనా అంతం చేయగలడు. ఎలాంటి విపత్కరమైన పరిస్థితులైనా సృష్టించగలడు. ఇప్పటికే జీవరాశి నాశనమైపోయింది. ఎన్నో జంతువులు అంతమయ్యే స్థితికి వచ్చాయి. సింహాలు, పులులు, ఖడ్గమృగాలు, చిరుతపులులు, జిరాఫీలు.. ఇలా చాలా జంతువులు అంతమయ్యే స్థితికి వచ్చాయి. అందుకు కారణం వాటిని విపరీతంగా వేటాడడమే.. వాటి అవయవాలకు బ్లాక్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండడంతో వేటగాళ్ళు ఈ జంతువులపై పడ్డారు. చాలా జంతువులను కాపాడుకోడానికి ప్రభుత్వాలు తమ వంతుగా కృషి చేస్తున్నా.. కానీ కాపాడుకోలేకపోతున్నారు.

ఇప్పుడు భారతదేశంలో చిరుతపులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎంతగా అంటే 75 శాతం నుండి 90 శాతం వరకూ తగ్గిపోయింది. కొందరు జంతు పరిరక్షకులు చేసిన సర్వేలో ఈ విషయం బహిర్గతమైంది. పులులను కాపాడుకోడానికి ‘ప్రాజెక్ట్ టైగర్’ ఎలా తీసుకొని వచ్చారో.. చిరుతల కోసం ప్రత్యేకమైన ప్రాజెక్ట్ తీసుకొని రావాలని వారు చెబుతున్నారు. భారతదేశంలో చిరుతలు విపరీతంగా తగ్గిపోడానికి వాటిని వేటాడడం, పొరపాటున జనావాసాల్లోకి అవి వచ్చినా వాటిని చంపేయడం చేస్తూ ఉన్నారు. చిరుతపులుల చర్మం కోసం కూడా వేటగాళ్లు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుండడంతో చిరుతల ప్రాణాలు గాల్లోకి కలిసిపోతున్నాయి. 120-200 ఏళ్ల క్రితం భారత్ లో ఉన్న చిరుతల సంఖ్యతో పోలిస్తే 75 శాతం నుండి 90 శాతం వరకూ తగ్గిపోయాయి. దీనిపై చేసిన రీసర్చ్ పేపర్ కు ‘జెనెటిక్ అనాలిసిస్ రివీల్ పాపులేషన్ స్ట్రక్చర్ అండ్ రీసెంట్ డిక్లైన్ ఇన్ లెపర్డ్స్ అక్రాస్ ఇండియన్ సబ్ కాంటినెంట్’ అని పేరు పెట్టారు. పీర్జ్-లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ లో ఈ రీసర్చ్ జర్నల్ ను పబ్లిష్ చేశారు.

గణనీయంగా తగ్గిన చిరుత పులుల సంఖ్య

బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్(సిడబ్ల్యూఎస్ ఇండియా), వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(WII) సైంటిస్టులు జెనెటిక్ డేటాను ఉపయోగించి భారతదేశంలోని చిరుతల సంఖ్యకు సంబంధించి సర్వే నిర్వహించారు. అలాగే ఎలా చిరుతల సంఖ్య తగ్గిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. 13 మెక్రోశాటిలైట్ మార్కర్లు ఉపయోగించి గుర్తించిన 56 చిరుతలతోపాటు ఇంతకుముందే గుర్తించిన 143 చిరుతల సమాచారాన్ని సమీకరించి అధ్యయనం చేసినట్లు బృందం సభ్యులు వెల్లడించారు. పులుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పుడు వాటిని పెంచడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అభినందనీయం..

ఇటీవల కాలంలో పులుల సంఖ్య కూడా బాగా పెరిగింది.. ఇలాంటి ప్రయత్నమే చిరుత పులుల విషయంలో కూడా చేయాలని స్టడీ ఆథర్స్ బల్లగుద్ది చెబుతున్నారు. చిరుతపులులను అకారణంగా చంపేస్తూ ఉన్నారని.. వాటిని ఎలాగైనా రక్షించుకోవాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. వాటి జీవనానికి అనువైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. సుప్రియాభట్‌, సువంకర్‌ బిస్వాస్‌, డాక్టర్‌ బివశ్‌ పాండవ్‌, డాక్టర్‌ కృతి కె.కారంత్‌ ఆధ్వర్యంలో సీడబ్ల్యూఎస్‌ బృందం ఈ అధ్యయనం చేపట్టింది. 2016-2018 మధ్య ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని 56 చిరుతపులులకు సంబంధించి జెనెటిక్ స్టడీస్, మలానికి చెందిన శాంపిల్స్ ను అధ్యయనం చేసి చిరుతల సంతతి గణనీయంగా తగ్గిందని గుర్తించారు. సాధారణంగా పులుల సంఖ్యను ప్రతీ నాలుగేళ్ళకొకసారి లెక్కేస్తారు.. కానీ చిరుతపులుల సంఖ్యను లెక్కపెట్టే విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి పద్ధతిని ప్రవేశపెట్టలేదు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.