బాలిక భూమిపై రాబందుల కన్ను ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Sep 2019 8:41 AM GMT
బాలిక భూమిపై రాబందుల కన్ను ..!

  • అనాథ బాలిక ఆస్తి కాజేసేందుకు భూ కుట్ర
  • రూ.3 లక్షల అప్పు పేరిట కోట్లు విలువజేసే భూమి స్వాహా
  • మోసపూరితoగా 3.10 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
  • నేతల ముందు గోడు వెల్లబోసుకున్న బాలిక
  • తన భూమి తనకు ఇప్పించాలని విజ్ఞప్తి

రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చందనవెళ్లి భూ నిర్వాసితులకు మద్దతుగా అఖిల పక్ష నాయకులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ ధర్నాకు ఓ బాలిక కూడా వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా స్టేజ్‌ ఎక్కింది. మైక్ పట్టుకుంది. తన బాధను చెప్పుకుంటూ పోయింది. ఆ బాలిక వేదన విని అక్కడున్న నిర్వాసితులే కాదు..నాయకుల మనసు కరిగింది.

అన్యంపుణ్యం ఎరుగని అమాయకురాలు . ఇంకా మైనారిటీ కూడా తీరలేదు ఐదేళ్ల వయసులోనే తండ్రిని..ఆ తరువాత కొన్ని రోజులకే తల్లిని కోల్పోయింది. అంతే...తల్లిదండ్రుల నుండి బాలికకు సంక్రమించిన కోట్ల విలువచేసే భూమిపై కన్నేశాయి భూ గద్దలు.

మారు అమ్మమ్మ మూడు లక్షలు అప్పు చేసింది. దానికి వడ్డీ పేరుతో రూ.40లక్షలు లెక్కగట్టారు. బాకీ తీర్చేందుకు అప్పు ఇచ్చిన పేరిట బాలికకు చెందిన భూమిని మాయమాటలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బాలిక ఫిర్యాదుతో నిజం తెలుసుకున్నారు షాబాద్ తహసీల్దార్‌. బాలిక విజ్ఞప్తి మేరకు మ్యుటేషన్ ఆపేశారు .

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఆస్పల్లిగూడకి చెందిన జోగమ్మగూడం అంజమ్మకు పుట్టినప్పటి నుంచి కష్టాలే. అంజమ్మకు ఐదేళ్ల వయసులోనే తండ్రి కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. తరువాత ..అంజమ్మ తల్లి తమకున్న 3.10 ఎకరాల్లో పొలం పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుండేది. ఇంతలోనే అంజమ్మ తల్లి అనుమానాస్పదంగా మృతి చెందింది. అప్పటి నుంచి అంజమ్మ తాత, మారు అమ్మమ్మ దగ్గర పెరిగింది.

హైదరాబాద్‌ శివారులో అంజమ్మకు తండ్రి నుంచి సంక్రమించిన కోట్లు విలువచేసే భూమి ఉండటంతో అందరీ కళ్లు దాని మీద పడ్డాయి. ఇక్కడే కుట్రలకు తెర లేపారు. మాయమాటలతో ఆమెతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు.

అంజమ్మ చెప్పిన వివరాలు ప్రకారం.. " అమెది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఆస్పల్లిగూడ గ్రామం. బాలమ్మ-బాలయ్యకు అంజమ్మ ఒక్కతే కూతురు. చిన్నప్పుడే నాన్నా చనిపోయాడు. కొన్ని రోజులకు అమ్మ కూడా చనిపోయింది. అమ్మ పేరు మీద ఆస్పల్లిగూడలో సర్వే నెంబర్ 524/లూ 3/1 సర్వే నెంబర్‌లో 1.20 ఎకరాలు, 534/అ/1 నెంబర్‌లో 1.30 ఎకరాలు చొప్పున మొత్తం 3.10 ఎకరాల భూమి ఉంది.

మా మారు అమ్మమ్మ భారతమ్మ ఆస్పల్లిగూడకు చెందిన ఎల్గొండ గంగాధర్ రెడ్డి దగ్గర 2013లో రూ.3 లక్షల అప్పు తీసుకుంది . అందుకు తన మైనార్టీ తీరిన తరువాత తన భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని మా అమ్మమ్మ మాట ఇచ్చింది. కాగితం కూడా రాసిచ్చింది. అప్పటి నుంచి నా పాస్ బుక్ కూడా గంగాధర్‌ రెడ్డి దగ్గరే ఉంది. పాస్‌ బుక్‌లో నాపేరు జోగమ్మగూడ అంజమ్మగానే ఉంది. పాఠశాల రికార్డుల్లో మాత్రం మా తాత ఇంటి పేరుతో పబ్బాల అనూష గా నమోదైంది. విషయం తెలుసుకున్నా గంగాధర్ రెడ్డి పాఠశాల రికార్డుల్లో ..నా పేరు తిరిగి జోగమ్మగూడం అంజమ్మగా మార్పించాడు. ఆధార్ కార్డ్ కూడా మార్పించాడు. నా పుట్టిన తేదీ 20-6-2002 అయితే.. ఆధార్ కార్డులో 01-01-2001గా నమోదు చేయించారు. ఆధార్ ప్రకారం ఈ ఏడాది జనవరిలో నా మైనార్టీ తీరింది. దీంతో గంగాధర్ రెడ్డి మా అమ్మమ్మపై ఒత్తిడి తెచ్చాడు. 2013లో రూ.3 లక్షలు అప్పు ఇస్తే వడ్డీతో కలిపి రూ.40 లక్షలు అయిందన్నారు.

మా తాత, అమ్మమ్మ కూడా గంగాధర్‌ రెడ్డికే వత్తాసు పలికారు. చివరకు ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఒకటిన్నర ఎకరం కాకుండా..లోపల ఉన్న ఎకరం 20 సెంట్లు రిజిస్ట్రేషన్ చేయడానికి ఒప్పుకున్నారు.

జనవరి 30న చేవెళ్ళ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు తీసుకెళ్లారు. డాక్యుమెంట్ రైటర్ దగ్గర 1.20 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించి సంతకం తీసుకున్నారు.సబ్ రిజిస్టర్ దగ్గరకు వెళ్లిన తర్వాత చాలా సంతకాలు తీసుకున్నారు నేను 1.20 ఎకరాలే రిజిస్ట్రేషన్ చేశానని అనుకున్నాను .. మూడు నెలల తర్వాత ఇంట్లో మా తాత, మారు అమ్మమ్మ మొత్తం భూమి రిజిస్ట్రేషన్ అయిందని మాట్లాడుకుంటున్నారు. అది విని సబ్ రిజిస్టర్ దగ్గరకు వెళ్లి అడిగాను. ఆయన నిజమేనని జిరాక్స్ కాపీ చూపించారు

నాకు మైనారిటీ తీరలేదని పదవ తరగతి మెమో చూపించడంతో సబ్ రిజిస్టర్ MRO కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని చెప్పారు . నేను షాబాద్ తహసీల్దార్ కి ఫిర్యాదు చేశాను. దాంతో గంగాధర్ రెడ్డి ఆస్పల్లిగూడ సర్పంచ్‌ను రంగంలోకి దింపాడు. ఆయన వచ్చి రూ.1.25 కోట్లకు భూమిని కొంటానని బేరం పెట్టాడు. డాక్యుమెంట్లలో నాకు చెక్కుల రూపంలో రూ.16.75 లక్షలు ఇచ్చినట్టు ఉంది. ఆ మొత్తాన్ని జడ్చర్లలో ఉన్న నా బ్యాంకు ఖాతాలో వేయడానికి ప్రయత్నించారు . అది తెలుసుకొని ఆ ఖాతాను నేను క్లోస్ చేయించాను. " అని అంజమ్మ తెలిపింది.

నేతలు, అధికారులే తనకు న్యాయం చేయాలని అంజమ్మ విజ్ఞప్తి చేస్తుంది. తనకు ఆ భూమి మాత్రమే ఉందని ..తన భూమి తనకు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేస్తుంది అంజమ్మ.

Next Story