రూ.2కోట్లు పెట్టి కారు కొన్నాడు. 20 నిమిషాల తరువాత చూస్తే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2020 9:30 AM GMT
రూ.2కోట్లు పెట్టి కారు కొన్నాడు. 20 నిమిషాల తరువాత చూస్తే..

ఎంతో ఇష్టపడి లగ్జరీ కారు కొన్నాడు. షో రూమ్‌ వాళ్లు కారు కీ ఇలా ఇవ్వగానే అలా రైడ్‌కు వెళ్లాలనిపించింది. ప్రపంచాన్ని జయించాననే ఆనందం ఓ వైపు.. తాను ఎంతో ఇష్టపడే స్పోర్ట్స్‌ కారులో ప్రయాణించనున్నాను అనే ఆనందం ఇంకోవైపు. ఇంకేముందుంది ఆనందంగా కారులో రోడ్డుపైకి వచ్చాడు. అలా కొద్దిదూరం వచ్చాడో లేదో.. కారులో ఏదో చిన్న సాంకేతిక సమస్య వచ్చింది. ఏ సమస్య వచ్చిందా అని కారుని ఆపి అలా దిగాడో లేదో వెనకనుంచి మరో కారు అతడి కారును వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతడి కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. రూ.2కోట్లు పెట్టి కొన్న కారు కనీసం అరగంట కూడా కాలేదు. ఇప్పుడే ఇలా జరిగిందేంటీ..? ప్రమాదంలో అతడికి ఏం కాకపోవడంతో అదృష్టం అనాలో.. కారు దెబ్బ తిన్నందుకు దురదుష్టం అనాలో తెలియని పరిస్థితి. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ పోలీసులకు సమాచారం అందించాడు ఆ కారు యజమాని. ఈ ఘటన బ్రిటన్‌లోని వేక్‌ఫీల్డ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి రూ.2కోట్ల విలువైన గ్రే కలర్‌ లంబోర్గిని హరికేన్‌ స్పైడర్‌ మోడల్‌ కారును కొన్నాడు. షో రూమ్‌ నుంచి కారు డెలివరీ తీసుకుని కొంత దూరం ప్రయాణించాడు. కారులో సాంకేతిక లోపం తలెత్తింది. ఏమైందో చూద్దామని కారును దిగాడు. అంతే.. వెనక నుంచి వేగంగా వచ్చిన మరో కారు అతడి కారును ఢీ కొట్టింది. దీంతో కారును వెనుకభాగం మొత్తం పూర్తిగా దెబ్బతింది. అతడు కారు కొని అప్పటికి 20 నిమిషాలు కూడా కాలేదు. చేసేది ఏమీ లేక బాదపడుతూనే పోలీసులకు సమాచారం అందించాడు. కారు ప్రమాదానికి గురైన ఫోటోలను స్థానిక పోలీసులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. పాపం అతడి కంటే దురదృష్టవంతుడు ఇంకా ఎవరు ఉండరంటూ నెటీజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.Next Story