ఒసామా బిన్‌ లాడెన్ అమ‌ర‌వీరుడు.. ఇమ్రాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Jun 2020 3:38 AM GMT
ఒసామా బిన్‌ లాడెన్ అమ‌ర‌వీరుడు.. ఇమ్రాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఉగ్ర‌వాద సంస్థ‌ అల్ ఖైదా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్‌ను.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమరవీరుడిగా కీర్తించారు. పాక్‌ పార్లమెంట్‌లో మాట్లాడిన‌ ఇమ్రాన్.. అమెరికా సైన్యం అబోటాబాద్ వచ్చి బిన్ లాడెన్‌ను చంపారు.. అదే అమరుడిని చేశార‌ని వ్యాఖ్యానించారు. మొదట బిన్ లాడెన్‌ను చంపార‌న్న‌ ఇమ్రాన్.. వెంటనే అమరుడిని చేశారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇమ్రాన్ వ్యాఖ్య‌లు విస్తృత ప్ర‌‌చారంలో ఉన్నాయి.

‘ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్’ పేరుతో అమెరికా.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన‌ ఒసామా బిన్ లాడెన్‌ను అంతం చేసేందుకు ప్ర‌ణాళిక రూపొందించింది. అందులో బాగంగానే.. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో దాక్కున్న లాడెన్‌ను.. అమెరికన్ సేనలు 2011 మే 2వ తేదీ అర్ధరాత్రి సమయంలో మెరుపుదాడి చేసి మట్టుబెట్టాయి. పాక్‌ను ఆనుకుని ఉన్న అప్ఘానిస్తాన్‌ నుండి పాక్‌ బలగాలకు తెలియకుండా పాక్‌లోకి ప్ర‌వేశించిన‌ అమెరికా సేనలు లాడెన్‌ను అంతం చేశాయి.

అయితే.. ఎవ‌రైనా సైనికులు దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు వ‌దిలితే.. వారిని అమ‌రులుగా కీర్తిస్తారు. 2001 సంవ‌త్స‌రం సెప్టెంబర్ 11న అమెరికాలోని ట్విన్ టవర్‌ను కూల్చివేసి.. వేలమంది ప్రాణాల‌ను బ‌లితీసుకున్న‌ ఉగ్ర‌వాదిని ఇమ్రాన్ ఖాన్ అమరవీరుడిగా కీర్తించడం ప్ర‌స్తుతం హాట్ టాఫిక్ గా మారింది. అయితే.. ఇమ్రాన్ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుబ‌ట్టాయి. ఉగ్ర‌వాది అయిన లాడెన్‌ను.. అమ‌ర‌వీరుడ‌ని పొగ‌డ‌డం ఏంట‌ని.. పాకిస్తాన్ ముస్లీం లీగ్ నేత క్వాజా ఆసీఫ్ మండిప‌డ్డారు.

Next Story