దేశ‌వ్యాప్తంగా వెటర్నరీ డాక్టర్‌ హత్యకేసు సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా చాలామంది ఖండించారు. డాక్ట‌ర్ హ‌త్య‌ను ఖండిస్తూనే ఇటువంటి అమాన‌వీయ ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ జ‌రుగ‌కూడ‌ద‌ని కోరుకున్నారు. అయితే.. కొంత‌మంది ఆక‌తాయి కుర్రాళ్లు మాత్రం జ‌రిగిన ఘ‌ట‌న‌పై ఎటువంటి సానుభూతిని ప్ర‌ద‌ర్శించ‌క‌పోగా.. మృతురాలి గురించి సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు చేశారు.

దీనిపై రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు రావడంతో.. పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులకు మద్దతు తెలిపే విధంగా బాధితురాలను కించపరిచేలా స్మైలీ నాని అనే యువకుడు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశాడు. పైగా అమ్మాయిలను అత్యాచారం చేస్తే తప్పులేదంటూ క‌నీసం బాధ్య‌త లేకుండా వ్య‌వ‌హ‌రించాడు.

అయితే స్మైలీ నాని పోస్టుల‌కు అభ్యంత‌రం తెలుపుతూ.. కొంద‌రు యువ‌కులు రిప్లై కామెంట్ లు పెట్టారు. అవి దూష‌ణ‌ల వ‌ర‌కూ వెళ్ల‌డంతో.. దర్పల్లి రాజశేఖర్‌ రెడ్డి అనే వ్యక్తి రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమర్‌నాథ్‌, శ్రవణ్‌, సందీప్‌ కుమార్‌, స్మైలీ నానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంతేకాదు ఇలాంటి సంఘటనలపై పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.