కుమారస్వామి కుమారుడి పెళ్ళికి యడ్యూరప్ప వెళ్లాడా.. నిజమెంత..?

By సుభాష్  Published on  20 April 2020 8:35 AM GMT
కుమారస్వామి కుమారుడి పెళ్ళికి యడ్యూరప్ప వెళ్లాడా.. నిజమెంత..?

దేశంలో కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతోంది. కొద్ది రోజుల కిందటే భారతదేశంలో ఎటువంటి పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు తావు లేదని తేల్చారు. కానీ ఇవేవీ పట్టనట్టు.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన కుమారుడు నిఖిల్ గౌడ పెళ్లి చేశారు.

ఏప్రిల్ 17న జాగ్వార్ హీరో నిఖిల్ వివాహం మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కృష్ణప్ప మనవరాలు రేవతితో రామనగరలో ఉన్న ఫార్మ్ హౌస్ లో జరిగింది. బెంగళూరు-మైసూరు హైవేకు సమీపంలో భారీ వేదిక నిర్మించి ఎంతో ఘనంగా నిర్వహించాలని కుమారస్వామి గతంలో భావించారు. కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా వ్యాపిస్తూ ఉండడంతో పెళ్లిని తక్కువ మంది కోసం మాత్రమే కుదించామని అన్నారు. కొందరు 200 మంది పైగానే హాజరయ్యారని చెబుతుండగా.. మరికొందరేమో 100 కార్లకు పైగా వచ్చాయని చెబుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప ఈ పెళ్ళికి హాజరయ్యారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. చాలా మంది పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తెలతో యడ్యూరప్ప ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. లాక్ డౌన్ అయినా కూడా ఘనంగా పెళ్లి నిర్వహించారంటూ ఆరోపణలు వస్తున్నాయి. సాధారణ ప్రజలకు ఒక న్యాయం.. బడా నేతలకు మరో న్యాయమా అంటూ ఎవరికి వాళ్ళు తిట్ల దండకాన్ని ఎత్తుకున్నారు. సాధారణ ప్రజలు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తీసిన ఫోటోలను.. ఘనంగా నిర్వహించిన ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.నిజమెంత:

నిఖిల్ కుమారస్వామి పెళ్ళికి యడ్యూరప్ప హాజరు అయ్యారు అని వైరల్ అవుతున్న ఫోటో, వార్త 'పచ్చి అబద్దం'.

ఈ ఫోటోని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా.. ఆ ఫోటో నిఖిల్ కుమారస్వామి నిశ్చితార్థం రోజు తీసిన ఫోటో అని స్పష్టం అయింది. ఫిబ్రవరి 10న, లాక్ డౌన్ కంటే ముందు ఈ ఫంక్షన్ ను నిర్వహించారు. తాజ్ వెస్ట్ ఎండ్ లో నిర్వహించిన ఈ ఫంక్షన్ కు అప్పట్లో పలువురు ప్రముఖులు హాజరైనట్లు పలు మీడియా సంస్థలు ఫోటోలు ప్రచురించాయి.. అలాగే వీడియోలను కూడా అప్లోడ్ చేశారు.పింకీ చూబే అనే ట్విట్టర్ అకౌంట్ నుండి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఫోటోలను అప్లోడ్ చేశారు. పోస్ట్ చేసిన సదరు అకౌంట్ హోల్డర్ రైటర్, పొలిటికల్ అబ్జర్వర్, హ్యూమన్ యాక్టివిస్ట్ అని తెలపడంతో ఈ పోస్టును చాలా మంది నమ్మేశారు. 4300 మందికి పైగా లైక్స్ వచ్చాయి.. 1200 పైగా రీట్వీట్స్ చేశారు. ఆమె పోస్టు చేసిందంతా తప్పుడు సమాచారమే..!

యడ్యూరప్ప కుమారస్వామి కుమారుడి పెళ్ళికి హాజరయ్యాడని 'పచ్చి అబద్ధం'

కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా కుమారస్వామి తన కొడుకు వివాహాన్ని నిర్వహిస్తాను అని చెబితే అందుకు మద్దతు తెలపడంపై విమర్శలు వస్తున్నాయి. కుమారస్వామి తన కుమారుడి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపాడని.. మొదట 20 మంది సమక్షంలో పెళ్లి అని చెప్పి.. ఆ తర్వాత చాలా మంది హాజరయ్యారని.. కనీసం నిబంధనలను పాటించలేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Next Story
Share it