కోవిడ్‌ మృతుల సంఖ్య 1,770.. చైనాలో కఠిన ఆంక్షలు..

By అంజి  Published on  18 Feb 2020 3:12 AM GMT
కోవిడ్‌ మృతుల సంఖ్య 1,770.. చైనాలో కఠిన ఆంక్షలు..

చైనాలో కోవిడ్‌ బాధితుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. కోవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో.. హుబే ప్రావిన్స్‌లో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఎవరు కూడా బయటకు రావొద్దని, ట్రాఫిక్‌ ఆంక్షలు, జనం గూమిగూడరాదని ఆదేశాలు జారీ చేసింది.

మరో వైపు చైనాలో కోవిడ్‌ మృతుల సంఖ్య 1,770 కి చేరింది. కోవిడ్‌ బాధిత కేసులు 70,548కి పైగా నమోదయ్యాయి. ఒక్క సోమవారం నాడే 105 మంది కోవిడ్‌ వైరస్‌ కారణంగా ప్రాణాలు విడిచారు. 2,048 మంది కొత్త కోవిడ్‌ బాధితులను గుర్తించారు.

కాగా ఇప్పటికే వేలాదిగా వైద్యులు, సిబ్బందిని చైనా ప్రభుత్వం వుహాన్‌కు తరలించింది. కోవిడ్‌ వైరస్‌ అంతకంతకు విస్తరిస్తున్న క్రమంలో.. మార్చి 5వ తేదీన జరగాల్సిన దేశ అత్యున్నత నిర్ణాయక మండలి నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ సమావేశాన్ని వాయిదా వేయనున్నారని చైనా మీడియా వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ఇంటెన్సివ్‌ కేర్‌ వైద్యుల్లో 10 శాతం మందిని వుహాన్‌ పంపిటనట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. అదనంగా మరో 30 వేల వైద్య సిబ్బందిని పంపుతన్నట్లు ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. త్వరలోనే హుబే నుంచి భారతీయులను తీసుకువస్తామని అధికారులు తెలిపారు. చైనా వైద్య సిబ్బంది కోసం ప్రత్యేక గ్లవ్‌లు, మాస్క్‌లు, సూట్స్‌తో పాటు సామాగ్రి పంపుతామని.. విమానం తిరుగు ప్రయాణంలో హుబే నుంచి భారతీయులను, పొరుగు దేశాలకు చెందిన వారిని కూడా తీసుకురానున్నట్లు భారత ప్రభుత్వం పేర్కొంది.

జపాన్‌ దేశంలోని టోక్యో తీరంలో నిలిపివేసిన ఓడలో మరో 99 మందికి కోవిడ్‌ సోకింది. ఓడలో 3,711 మంది ఉన్నారు. కాగా ఇప్పుడు మొత్తం కోవిడ్‌ సోకిన వారి సంఖ్య 454కి చేరింది.

వైరస్‌ సోకలేదని తేలడంతో ఢిల్లీలోని ఐటీబీపీ ఆస్పత్రి నుంచి భారతీయులను డిశ్చార్జ్‌ చేశారు.

Next Story