అక్కడ అదే 'కొవిడ్‌-19' తొలి మరణం.. ఓ చైనా వృద్ధ పర్యాటకురాలితో..

By అంజి  Published on  15 Feb 2020 11:57 AM GMT
అక్కడ అదే కొవిడ్‌-19 తొలి మరణం.. ఓ చైనా వృద్ధ పర్యాటకురాలితో..

యూరప్‌లో మొట్టమొదటి 'కొవిడ్‌-19' మరణం చోటు చేసుకుంది. చైనాకు చెందిన ఓ వృద్ధ పర్యాటకురాలు 'కొవిడ్‌-19' వ్యాధితో మృతి చెందింది. ఈ మేరకు ఫ్రాన్స్‌ ఆరోగ్యశాఖ మంత్రి అగ్నిస్‌ బుజైన్‌ తెలిపారు. జనవరి 16న చైనాకు చెందిన ఓ వృద్ధురాలు ఫ్రాన్స్‌లో పర్యటించేందుకు వచ్చింది. అయితే జనవరి 25న పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేరిన.. ఆమె అప్పటి నుంచి అక్కడే ఉందని అగ్నిస్‌ బుజైన్‌ పేర్కొన్నారు. వైరస్‌ సోకకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హాంగ్‌కాంగ్‌, జపాన్‌, ఫిలిఫ్పైన్‌ దేశాల్లో కోవిడ్‌ వ్యాధి బారిన పడి ఒక్కొక్కరు మృతి చెందారు. మరో వైపు చైనాలో కోవిడ్‌-19 విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడి దాదాపు 1500 మందికిపైగా మరణించారు. చైనాలోని హుబెయ్‌ ప్రావిన్స్‌లో వేలాది మంది ప్రజలు కోవిడ్‌ వ్యాధి సోకి అల్లాడుతున్నారు.

మరోవైపు జపాన్‌కు చెందిన డైమండ్‌ ప్రిన్సెస్‌లో నౌకలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా వైద్యులు చేసిన పరీక్షల్లో.. కొత్తగా మరో 67 మందికి ఈ వ్యాధి సోకిందని తెలిసింది. ఈ విషయాన్ని జపాన్‌ ఆరోగ్యశాఖ మంత్రి కత్సునోబు చెప్పారు. కాగా నౌకలో ఇప్పటివరకు 218 మందికి కోవిద్‌-19 వ్యాధి సోకింది. ఇదిలాఉంటే.. నౌకలో ఉన్న తమ దేశీయులను తీసుకెళ్లేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. అమెరికా వాసులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని పంపేందుకు రంగం సిద్ధం చేసినట్లు అమెరికా వర్గాలు తెలిపాయి.

డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో 138 మంది భారతీయులు ఉన్నారు. వారిని త్వరలో భారత్‌ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భారత రాయబార అధికారులు తెలిపారు. ప్రస్తుతం నౌక యొకోహమా పోర్టులో నిలిపివేశారు.

ఇప్పటి వరకు 25 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 67 వేలకుపైగా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. జపాన్‌ ఓడలోని ముగ్గురు భారతీయులకు సైతం కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 197 మంది కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి.

Next Story