ముఖ్యాంశాలు

  • ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా

  • కరోనాపై సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు

  • పరిశోధకులు ఏమంటున్నారు..?

కోవిడ్‌ -19 (కరోనా వైరస్‌).. ఇది ప్రపంచాన్నే వణికిస్తోంది. కరోనా వైరస్‌ సోకకుండా ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు తీవ్రంగా  కృషి చేస్తున్నారు. ఈ భయంకరమైన వైరస్‌ ఎన్నో అనుమానాలు, అపోహాలకు దారి తీస్తోంది. వైరస్‌ నివారణకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా, కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే వైరస్‌ రాకుండా ఉండేందుకు, అలాగే వైరస్‌ వచ్చినా తగ్గుతుందని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

కరోనా వైరస్‌ అంటే ఏమిటీ..?

కరోనా వైరస్‌ మానవునిలో ఇంతకుముందెన్నడు గుర్తించలేదు. చైనాలోని వుహాన్‌లో మొట్టమొదటి సారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. ఈ వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న చైనాలో ఇప్పటి వరకు 1500లకు పైగా మృతి చెందారు. కొత్తగా 4వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. వేల సంఖ్యలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

వెల్లుల్లి తింటే కరోనా వైరస్‌ తగ్గుతుందా..?

వెల్లుల్లి తింటే కరోనా తగ్గుతందని వాట్సాప్‌లలో, ఇతర సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనిని నమ్మవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉడికించిన వెల్లుల్లి నీటిని ఒక గ్లాస్‌ తాగడం వల్ల వైరస్‌ సంక్రమణకు చికిత్స చేయవచ్చని ఉంది. అయితే వెల్లుల్లిలో యాంటీమైక్రోబయాల్‌ లక్షణాలతో ఉన్నప్పటికీ ఇది కరోనా వైరస్‌ను చంపుతుందన్నగ్యారంటి లేదు. అంతేకాకుండా ఈ వైరస్‌ను నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి మెడిసన్‌ సిఫారసు చేయలేదు. కరోనా నివారణకై అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. తాజాగా భారత సంతతికి చెందిన ఓ పరిశోధకు కరోనా వైరస్‌ నివారణకు మెడిసిన్‌ను కనిపెట్టారు. కాని అది పరీక్ష దశలో ఉంది. ఇది పూర్తిస్థాయిలో పరీక్షలు పూర్తి చేసుకుని బయటకు రావాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

​చైనా వస్తువులు కొంటే కరోనా వస్తుందా..?

చైనా నుంచి వచ్చే వస్తువులను స్వీకరిస్తే కరోనా వస్తుందని పుకార్లు వ్యాపిస్తున్నాయి. మొబైళ్లు, ఇంకేదైనా వస్తువులు ఆన్‌లైన్‌లో గానీ, ఇతర ఫ్లాట్‌ఫాంల ద్వారా చైనా నుంచి వచ్చిన వస్తువులు తీసుకోవడం వల్ల వైరస్‌ సోకుతుందని పలువురు చెబుతుండగా, ఈ అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టిపారేసింది. చైనా నుంచి వచ్చే ఏ వస్తువులు గానీ తీసుకున్న క్రమంలో వైరస్‌ వ్యాపించే అవకాశాలు ఏ మాత్రం లేవని పరిశోధకులు తేల్చి చెబుతన్నారు. టెన్షన్‌ పడకుండా చైనా నుంచి ఏదైనా ఆర్డర్‌ చేసుకోవచ్చని సూచిస్తోంది.

చైనీస్‌ ఫుడ్‌ కారణమా..?

చైనాలో ఈ వైరస్‌ వ్యాపించిన తర్వాత దేశ వ్యాప్తంగా పాకుతోంది. దాదాపు 25 దేశాలకు ఈ వైరస్‌ వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ వైరస్‌ వల్ల సోషల్ మీడియాలో రకరకాలుగా తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. చైనీస్‌ రెస్టారెంట్లు, చైనీస్‌ ఫుడ్‌ తింటే ఈ వైరస్‌ వ్యాపిస్తుందని పుకార్లు వ్యాపిస్తున్నాయి. కాకపోతే ఈ ఫుడ్‌ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ వీటి వల్ల కరోనా వ్యాపిస్తుందనడంలో ఎలాంటి ఆధారాలు లేవు. అంతేకాదు చైనీస్‌ ఫుడ్‌ తింటే ఈ వైరస్‌ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించలేదు. ఇష్టమైన నూడుల్స్‌, ఇతర చైనీస్‌ ఫుడ్‌ తినడం వల్ల ఈ వైరస్‌ రాదని నిపుణులు చెబుతున్నారు.

గడ్డ కట్టిన పదార్థాలు తింటే..

ఇక సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం అవుతున్నదానిలో ఇదొకటనే చెప్పాలి. ఐస్‌క్రిమ్‌, కుల్ఫీ, శీతలపానీయాల పాటు గడ్డకట్టిన ఆహార పదార్థాల ద్వారా కరోనా వైరస్‌ వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టిపారేసింది. అంతేకాదు చల్లని ఆహార పదార్థాల ద్వారా ఈ వైరస్‌ వస్తుందని ఎక్కడ ప్రకటించలేదు.

ఉప్పు నీటితో వైరస్‌ తగ్గుతుందా..?

అలాగే వైరస్‌ ఉన్న వ్యక్తి నోటిని ఉప్పు నీటితో కడగడం వల్ల కరోనా తగ్గుతుందని వస్తున్న వదంతులపై వుహాన్‌ యూనాని ఆస్పత్రి, అకాడెమిషియన్‌ జాంగ్స్‌ బృందం కొట్టి పారేసింది. ఈ వైరస్‌ చికిత్సకు ఉప్పు నీరు ఉపయోగపడుతుందని వస్తున్న పుకార్లను ఖండించింది. ఈ పుకార్లన్ని తప్పుడు వార్తలేనని, ఇందులో వైద్య శాస్త్రంగా ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది.

పెంపుడు జంతువులతో కరోనా వస్తుందా..?

పెంపుడు జంతువులతో కరోనా వైరస్‌ వస్తుందని వస్తున్న వదంతులపై ఎలాంటి సాక్ష్యాలు లేవు. పెంపుడు జంతువులను ముట్టుకున్న సందర్భంలోమన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త  చర్యగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు వైద్యని పుణులు.

కరోనా వైరస్‌కు చికిత్స ఉందా..?

కరోనా వైరస్‌ సోకిన తర్వాత నివారణ చర్యలేమైనా ఉన్నాయా? అనే విషయాన్ని చెప్పలేకపోతున్నారు వైద్యులు. ప్రస్తుతానికి కరోనా చికిత్సకు మెడిసిన్‌ ఏదీ కనుక్కోలేదు. దీనిపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి క్లినికల్‌ ట్రయల్స్‌ ద్వారా పరీక్షించబడతాయి. దీనిపై పరిశోధకులు చాలా శ్రమిస్తున్నారు. ఇతర దేశాల్లో వైరస్‌ మెడిసిన్‌ తయారు చేసేందుకు చాలా పరిశోధనలు చేస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.