కోటప్పకొండ పర్యాటక క్షేత్రంలో అరుదైన చేపలు మృతి...

By Medi Samrat
Published on : 11 Oct 2019 11:08 AM IST

కోటప్పకొండ పర్యాటక క్షేత్రంలో అరుదైన చేపలు మృతి...

కోటప్పకొండ పర్యాటక క్షేత్రంలోని అక్వేరియంలో ఉంచిన అరుదైన జాతి చేపలు మృతి చెందాయి. సిబ్బంది నిర్లక్ష్యం వీటి మరణానికి కారణమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. లక్షలాది రూపాయల విలువైన వీటిని గత ప్రభుత్వ హయాంలో వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు.

అరుదైన చేపలు మృత్యువాతగుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ కొండ మార్గంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన పర్యావరణ, పర్యాటక క్షేత్రంలోని అక్వేరియంలో గల అరుదైన చేపలు మృత్యువాత పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని లక్షలాది రూపాయలు వెచ్చించి వివిధ ప్రాంతాల నుంచి అరుదైన జాతి చేపలు తెచ్చి 14 అక్వేరియంలలో ఉంచారు. కొంత కాలంగా అక్వేరియాల నిర్వహణ సరిగా లేనందున 50కి పైగా చేపలు చనిపోయాయి. సిబ్బంది నిర్లక్ష్యమే చేపల మృతికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గతంలో అనుభవజ్ఞులైన సిబ్బంది ఇక్కడ పని చేసేవారు. ప్రభుత్వం మారాక పర్యావరణ, పరిరక్షణ క్షేత్రంలో కొందరు సిబ్బందిని విధులను తప్పించారు. వారి స్థానంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులను నియమించారు. వీరికి అక్వేరియం నిర్వహణపై అవగాహన లేకపోవటం చేపల మరణానికి కారణమైంది. సుమారు రూ. 4లక్షలకుపైగా విలువైన చేపలు మృత్యువాత పడ్డాయి. చేపల మృతి అంశంపై అటవీశాఖ రేంజర్ నీలకంఠేశ్వరరెడ్డిని వివరణ కోరగా.. ఇంతవరకూ తమకు విషయం తెలియదని.. చేపల మృతిపై విచారణ జరుపుతామని తెలిపారు.

Next Story