గ్రాండ్‌మాస్టర్‌.. 'ప్ర‌పంచ ఛాంపియ‌న్' అయ్యింది..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Dec 2019 3:32 AM GMT
గ్రాండ్‌మాస్టర్‌.. ప్ర‌పంచ ఛాంపియ‌న్ అయ్యింది..!

భారత మహిళా చెస్‌ క్రీడాకారిణి, గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి తన కెరీర్‌లోనే అతిపెద్ద‌ విజయం సాధించింది. శనివారం ముగిసిన ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్ షిప్ లో హంపి మహిళల విభాగంలో నూత‌న ప్ర‌పంచ ఛాంపియ‌న్‌గా అవతరించింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మ‌హిళా చెస్‌ క్రీడాకారిణిగా రికార్డుల్లోకి ఎక్కింది.

నిర్ణీత‌ 12 రౌండ్ల తర్వాత కోనేరు హంపి, లీ టింగ్‌జి (చైనా), అతాలిక్‌ ఎకతెరీనా (టర్కీ) 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా హంపి, లీ టింగ్‌జి తొలి రెండు స్థానాల్లో నిల‌వ‌గా... అతాలిక్‌ మూడో స్థానంలో నిలిచింది.

హంపి, లీ టింగ్‌జి మధ్య ప్రపంచ చాంపియన్ ను నిర్ణయించేందుకు రెండు బ్లిట్జ్‌ గేమ్‌లు నిర్వహించారు. తొలి బ్లిట్జ్‌ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హంపి 29 ఎత్తుల్లో ఓడిపోగా... రెండో బ్లిట్జ్‌ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 45 ఎత్తుల్లో గెలిచింది. ఇద్ద‌రూ 1–1 గెలిచి సమంగా నిల‌వ‌డంతో విజేతను నిర్ణయించేందుకు చివరగా ‘అర్మగెడాన్‌ గేమ్‌’ను నిర్వహించారు.

అయితే.. ఈ ‘అర్మగెడాన్‌’ నిబంధన ప్రకారం గేమ్‌లో తెల్లపావులతో ఆడితే తప్పకుండా గెలవాలి. ఒకవేళ ‘డ్రా’ అయినా నల్లపావులతో ఆడిన వారిని విజేతగా ప్రకటిస్తారు. నల్లపావులతో ఆడిన హంపి 66 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవడంతో ఆమె ప్రపంచ చాంపియన్‌గా ఆవిర్భవించింది. లీ టింగ్‌జి రన్నరప్‌గా నిలిచి రజతంతో స‌రిపెట్ట‌కోగా.. అతాలిక్‌కు కాంస్యం ఖాయమైంది.

హంపి టోర్నీ ఆరంభం నుండి.. మార్గరిటా పొటపోవా, నినో ఖోమెరికో, కొవలెవ్‌స్కాయ, ఓల్గా గిరియా, నానా జాగ్‌నిద్జే, దరియా వోయిట్, తాన్‌ జోంగిలపై గెలిచింది. దరియా చరోచిక్నా, అనా ముజిచుక్, అతాలిక్‌ ఎకతెరీనా, కాటరీనా లాగ్నోలతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. ఇరీనా బుల్‌మగా చేతిలో ఓడిపోయింది.

Next Story