కోనేరు హంపి వర్సెస్ ద్రోణవల్లి హారిక..కానీ వీరి స్నేహం మాత్రం..

అంతర్జాతీయ వేదికపై స్నేహితుల మధ్య పోటీ ఎలా ఉంటుందో మనకు తెలుసో తెలీదో కానీ.. కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు మాత్రం తెలుసు. చెస్ గ్రాండ్ మాస్టర్లు అయిన కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ వీరిద్దరూ అమెరికా లోని సెయింట్ లూయిస్ లో జరిగిన కాయిర్న్స్ కప్ చెస్ టోర్నమెంట్ లో తలపడ్డమే ఇక్కడ విశేషం.

విజయవాడకు చెందిన వీరిద్దరికీ చిన్నప్పటి నుండే మంచి పరిచయం.. స్నేహితులుగా ఎన్నో చోట్లకు వెళ్లారు. ఎన్నో కాంపిటీషన్స్ లో ఇతరులతో తలపడ్డారు.. గతంలో వీరిద్దరూ కూడా ఒకరితో ఒకరు తలపడ్డారు. చివరి రౌండ్ లో హంపితో హారిక తలపడింది.. ఆ మ్యాచ్ కాస్తా డ్రాగా ముగిసింది. ఈ టోర్నమెంట్ ఛాంపియన్ గా హంపి నిలవగా హారిక ఐయిదో స్థానంతో సరిపెట్టుకుంది.

స్నేహం – చెస్ లో పోటీ.. వారి మాటల్లోనే

మా ఇద్దరి పరిచయం ఇప్పటిది కాదు.. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు కాబట్టి.. హారికతో మ్యాచ్ అంటే తనకేమీ టెన్షన్ గా అనిపించలేదని కోనేరు హంపి చెప్పుకొచ్చింది. హారిక మ్యాచ్ చాలా ముఖ్యమైందని.. అప్పటికే పాయింట్ల పట్టికలో నేను లీడ్ లో ఉన్నాను..ఆ సమయంలో టోర్నమెంట్ ను గెలవడానికి ఎంతో ఆతృతగా ఉన్నానని చెప్పింది హంపి.

ఈ టోర్నమెంట్ కోసం అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుండి హారికను వైరల్ ఫీవర్ వెంటాడింది. యాంటీ బయోటిక్స్ తీసుకొంటూనే టోర్నమెంట్ ఆడింది. ప్రత్యర్థుల లిస్టును మొదటి రోజే చూశానని.. చివరి రౌండ్ లో హంపితో తలపడాలని తమ షెడ్యూల్ లో ఉందని హారిక చెప్పుకొచ్చింది. హంపితో ముందు నుండి పరిచయం ఉందని.. ఆమెతో మ్యాచ్ అనగానే తానేమీ ప్రత్యేకంగా ఫీల్ అవ్వలేదని.. సాధారణంగానే తన చెస్ కాంపిటీషన్స్ లో మరో రోజులా అనిపించిందని హారిక నవ్వుతూ బదులిచ్చింది.

‘హారిక నాకు చాలా సన్నిహితురాలు.. ఒకరి పట్ల మరొకరికి గౌరవం ఉంటుంది. చెస్ బోర్డు ఎదురుగా మాత్రం ఒక ప్రత్యర్థిగానే భావిస్తానని’ 2019 డిసెంబర్ లో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన కోనేరు హంపి స్పష్టం చేసింది. తమ ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని చెప్పింది హారిక. హంపి వరల్డ్ నెంబర్ 2.. నేను వరల్డ్ నెంబర్ 9.. తామిద్దరూ చాలా టోర్నమెంట్లలో పాల్గొన్నామని.. కొన్ని టోర్నమెంట్స్ లో ఆడే భారతీయులం తామిద్దరమేనని అంది హారిక.

హారిక-హంపి ఏదైనా టోర్నమెంట్స్ కు వెళ్ళినప్పుడు కూడా చాలా చోట్లకు కలిసి ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. షాపింగ్ కు వెళ్లడం.. ఏదైనా ప్రాంతాన్ని చూడడానికి వెళ్లడం.. ఇలా ఎన్నో పనులు కలిసే చేసేవారు. ముఖ్యంగా ఇద్దరి మాతృ భాష తెలుగు కావడం కూడా ఇద్దరి మధ్య అనుబంధానికి ముఖ్య కారణం అని చెప్పొచ్చని అంటారు వీరిరువురూ..! తామిద్దరం కలిసినప్పుడు గేమ్ గురించి మాత్రమే కాకుండా చాలా విషయాలు మాట్లాడుకుంటామని.. హారికకు సినిమాలంటే చాలా ఇష్టమని.. ఏవి చూడాలి.. ఏవి చూడకూడదు అని తనకు కూడా సూచనలు ఇస్తూ ఉంటుందని.. హారిక ఎవరితోనైనా సులువుగా కలిసిపోద్దని హంపి తెలిపింది. ఇద్దరి స్వభావాలు వేరు కావడం వలన కలిసిపోడానికి పెద్ద సమయం పట్టదని వీరు నమ్ముతున్నారు. ‘కోనేరు హంపి వర్సెస్ ద్రోణవల్లి హారిక’ అన్నదే ప్రపంచం చూస్తోంది.. కానీ ఇద్దరు స్నేహితుల్లో ఎవరు బాగా ఆడితే ఆరోజు వారికే విజయం వరిస్తుందన్నది చాలా మందికి తెలియాలి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.