కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘట్టం.. నేడు కొండపోచమ్మ ఒడిలోకి గోదావరి నీళ్లు
By సుభాష్ Published on 29 May 2020 9:16 AM ISTకాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్బుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో సముద్రమట్టానికి వంద మీటర్లలోపే పారే గోదారమ్మ ముహూర్తం ఖరారైంది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పంప్ హౌస్‌ను ప్రారంభించనున్నారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్న కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు ఉదయం 11:30 గంటలకు మర్కూక్ పంప్ హౌస్‌లో రెండు మోటర్లను ఆన్ చేసి కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయనున్నారు. త్రిదండి చినజీయర్ స్వామి యజ్ఞం నిర్వహించి ఆశ్వీర్వచనం అందజేయనున్నారు.
కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజవర్గం పరిధిలో మర్కూక్, పాములపర్తి గ్రామాల సమీపంలో 15 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం ఈ కొండపోచమ్మ రిజర్వాయర్‌ను నిర్మించింది. సిద్దిపేట జిల్లాలోని శ్రీరంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి 16 కిలోమీటర్ల సోరంగం ద్వారా మల్లన్నసాగర్ పంప్‌హౌస్‌కు చేరుకున్న గోదావరి జలాలు అక్కడ ఎత్తిపోయడం ద్వారా అక్కారం పంప్ హౌస్‌కు, అక్కడి నుంచి మర్కూక్ పంప్‌హౌస్‌కు వచ్చి చేరుకున్నాయి. మర్కూక్‌లో మరోసారి ఎత్తిపోయడం ద్వారా కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేరనున్నాయి.
కాగా, తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రాంతానికి (618 మీటర్లు) గోదావరి నీటిని ఎత్తిపోయడం విశేషం. 15టీఎంసీల సామర్థ్యం గల కొండపోచమ్మసాగర్ నుంచి ఇతర ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తారు.