విరాట్ ను ఊరిస్తున్న.. ఆ రెండు రికార్డులు..
By Newsmeter.Network Published on 23 Jan 2020 9:33 AM GMTటీమిండియా ప్రస్తుతం మంచి జోష్ లో ఉంది. వరుసగా సిరీస్ విజయాలు సాధిస్తూ న్యూజిలాండ్ తో తలపడేందుకు సిద్దమైంది. ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో శుక్రవారం తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. కాగా పరుగుల యంత్రం విరాట్ కోహ్లిని ప్రస్తుతం ఓ రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ మరో ఎనిమిది సిక్సర్ బాదితే 50 సిక్సర్లు బాదిన రెండో కెప్టెన్ గా నిలుస్తాడు. కాగా కోహ్లి ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20ల్లో 74సిక్సర్లు కొట్టాడు. కెప్టెన్ గా 50 సిక్సర్ల మార్కును చేరుకోవడానికి మరో 8 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. న్యూజిలాండ్ తో టీమిండియా 5టీ20 మ్యాచులు ఆడనుండడంతో కోహ్లి ఈ సిరీస్ లోనే ఆ మార్కును అందుకునే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ 62 సిక్సర్లతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.
మహేంద్రుడి రికార్డుకు చేరువలో..
టీ20ల్లో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డుకు కోహ్లి ఆమడ దూరంలో ఉన్నాడు. టీమిండియా తరుపున ధోని కెప్టెన్‌గా 62 ఇన్నింగ్స్‌ల్లో 1,112 పరుగులు సాధించాడు. కేవలం 32 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ 1,032 పరుగులు సాధించాడు. మరో 80 పరుగులు చేస్తే ధోని రికార్డును కోహ్లి బ్రేక్ చేయనున్నాడు. కాగా కెప్టెన్ గా టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ పేరిట ఉంది. డుప్లెసిస్ 1,273 పరుగులతో ఉండగా కోహ్లి మరో 241 పరుగులు చేస్తే డుప్లెసిస్ రికార్డును అధిగమిస్తాడు. డుప్లెసిస్ తర్వాత స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(1083) ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లి-విలియమ్సన్‌ల మధ్య ‘పరుగుల పోరు’ అభిమానులకు విందు పంచడం ఖాయం