ముఖ్యాంశాలు

 • సంక్రాంతికి కోస్తాలో పెద్ద ఎత్తున కోడి పందాలు
 • పుంజుల కాలి వేళ్లకు పదునైన బ్లేడ్లు
 • పదునైన బ్లేడ్లకు ప్రమదకరమైన విషం పూతలు
 • బ్లేడు తగిలి, విషం ఎక్కి ఓ పందెంరాయుడు మృతి
 • పెద్ద ఎత్తున పందెం కోళ్లు, బ్లేడ్లు, నగదు స్వాధీనం
 • కోడి పందెం రాయుళ్లపై కేసుల నమోదు
 • డ్రోన్ కెమెరాల సాయంతో పందెం స్పాట్ల చిత్రీకరణ
 • ప.గో జిల్లాలో కొడి పందాల్లో తెలంగాణ మంత్రి
 • భారీగా పందాలు కాసిన టి.మంత్రి తలసాని
 • టి. మంత్రిని అడ్డుకోలేక పోయిన స్థానిక పోలీసులు
 • కోళ్ల పందాల కారణంగా కొన్ని చోట్ల ఘర్షణలు

సంక్రాంతి అంటేనే కోస్తాలో కోళ్ల పందాలు అని అర్థం. పండగ రోజుల్లో కోస్తాంధ్రంలో కోళ్ల పందాల మీద జరిగే బెట్టింగులు దాదాపుగా మన దేశం బడ్జెట్ కి సరిసమానం అవుతాయంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇందులో అనేక రకాలైన సాధకబాధకాలున్నాయి. కేవలం ఈ కోడి పందాల్లో సర్వస్వాన్నీ కోల్పోయి రోడ్డుమీద పడిన వారుకూడా ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్ట్ కోళ్ల పందాలను నిర్వహించడం చట్ట విరుద్ధమైన తీర్పు ఇచ్చింది.

ఎన్ని రకలా కట్టుదిట్టాలు చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని తీర్పులు వచ్చినా ఏడాదికోసారి వచ్చే సంక్రాంతి సందర్భంగా కోస్తాలో జరిగే కోడి పందాలను ఆపడం ఎవరి తరం కావట్లేదు. తాజాగా ఈసారి సంక్రాంతి పండగ సందర్భంగా జరిగిన కోడి పందాల్లో ఓ వ్యక్తి ప్రాణం నిట్టనిలువునా గాల్లో కలిసిపోవడం విస్మయం గొలిపే అంశం.

పందెంకోళ్లని బరిలోకి దింపేముందర వాటి కాలి వేళ్లకు అత్యంత పదునైన బ్రేడ్లని కడతారు. చాలా సందర్భాల్లో ఈ బ్లేడ్లకు విషాన్ని పూసి కోడిన బరిలోకి వదులుతారు. అంటే ఈ కోడి కాలికి ఉన్న కత్తుల ద్వారా అవతలి కోడి శరీరంలోకి విషం చేరుతుందన్న మాట. పందెంకోళ్లు ఎంత మెరుపువేగంతో ప్రత్యర్థి కోడిమీద దాడిచేస్తే అంత వేగంగా పోటీ పూర్తవుతుంది.

ఈ రకమైన ప్రయాసలో ఒక్కోసారి కోడి కాలికి ఉన్న విషపూర్తిమైన కత్తులు ఫైటింగ్ సమయంలో చుట్టూమూగి చూస్తున్నవారికి  పొరపాటున తగిలితే క్షణాల్లో అలా తగిలినవాళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కోళ్ల పందాలకోసం వినియోగించే విషం అంత పవర్ ఫుల్. ప్రత్యేకంగా పాములవాళ్ల దగ్గరినుంచి అత్యంత ప్రాణాంతకమైన తాచుపాములనుంచి సేకరించిన విషాన్ని కొనుగోలు చేయడం ద్వారా ఈ పోటీలకోసం సేకరించడం కోస్తా ప్రాంతంలో వాళ్లకి అలవాటు.

సరిగ్గా అలాగే ప్రాణాంతకమైన తాచుపాము కోరల నుంచి సేకరించిన విషాన్ని ఈ సారి జరిగిన పోటీల్లోకూడా కోళ్ల కాలి వేళ్లకు కట్టిన బ్లేడ్లకు పూసి ఉండారేమో అన్న విషయం పూర్తిగా ప్రాథమిక విచారణలో నిర్థారణ కాలేదుగానీ మొత్తానికి కోడిని పందెంలోకి దింపిన యజమానికే కోడి కాలికి ఉన్న ఆ బ్లేడ్ తగలడంతో అక్కడికక్కడే తను నురగలు కక్కుకుని చనిపోయాడు.

ఈ సందర్భంగా అకారణంగా చెలరేగిన ఘర్షణల్లో ఇరువర్గాలు తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రస్థాయిలో గాయాలపాలయ్యారని పోలీసులు చెబుతున్నారు. పెదవేగి మండలంలోని కవ్వగుండ గ్రామంలో ఈ విధంగా జరిగిన గొడవల్లో పదిమంది తీవ్రగాయాలపాలయ్యారు.

అదే విధంగా చింతంపల్లి గ్రామంలో జరిగిన గొడవల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రస్థాయిలో గాయపడ్డారు. ఓ వ్యక్తికైతే కాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయినట్టుగా తెలుస్తోంది. గాయపడినవారందరినీ చింతంపల్లి గ్రామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఓ వ్యక్తి ఆచూకీ అస్సలు తెలియకపోవడం మరింత గందరగోళానికి తెరలేపింది.

పోలీసులు ఈ కోడిపందేలను చిత్రీకరించడానికి వివిధ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు జిల్లాల్లో దాదాపుగా 500 రింగుల్లో కోడి పందేలు జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం. నిజానికి ఈ విధంగా కోళ్ల కాలి వేళ్లకు విషపూరితమైన, పదునైన బ్లేడ్లను కట్టి పందాలు ఒడ్డడాన్ని సుప్రీంకోర్ట్ పూర్తి స్థాయిలో నిషేధించింది.

కానీ పండగ సీజన్ లో అధికారికంగా ఈ పందేలను కంట్రోల్ చేయడం స్థానిక పోలీసులకు మాత్రం అత్యంత కష్టతరమైన పనిగా మారింది. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెందిన అనుయాయులు, వాళ్ల మనుషులు పెద్ద ఎత్తున ఈ కోళ్ల పందేళ్లో పాల్గొంటారు కనుక  వాళ్లను అడ్డుకోవడానికి వీల్లేదంటూ పోలీసులపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది.

కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉంటుంది ఈ కోళ్ల పందాల విషయంలో పోలీసుల పరిస్థితి. సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఇలా కోళ్ల పందేలను నిర్వహించడం చట్ట విరుద్ధం. దాన్ని అడ్డుకోవడం, జనాన్ని, గుంపుల్ని చెదరగొట్టడం, కేసులు పెట్టడం పోలీసుల బాధ్యత. కానీ స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఒత్తిడిని తట్టుకోవడం ఏమంత సామాన్యమైన విషయం కాదు.

తెలంగాణ జంతు- పశు సంరక్షణ శాఖమంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండిలో ఈ కోళ్ల పందాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టుగా సమాచారం. నేరుగా యానిమల్ హస్బెండరీ మినిస్టరే ఈ విధంగా కోడి పందాల్లో పాల్గొంటే ఇంక మంత్రుల అనుయాయులను, సామాన్యులను కట్టడి చేయడం స్థానిక పోలీసులకు ఎంత కష్టతరమైన విషయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇవిమాత్రమే కాక పండగ సీజన్ లో ఈ ప్రాంతాల్లో గుండాట, మూడుముక్కలాట, సట్టా లాంటివి విపరీతంగా జరుగుతాయి. నిజానికి ఇవన్నీ చట్టబద్ధంగా నిషేధించబడిన ఆటలే. ఇవన్నీ పూర్తిగా జూదం కిందికే వస్తాయి. ఇవన్నీ జరిగే చోట్ల పెద్ద ఎత్తున ఫుడ్ స్టాల్స్, లిక్కర్ బెల్ట్ షాపులు కూడా వెలవడం కొత్త విషయం ఏమీ కాదు.

సంక్రాంతి, కనుమ పండుగల్లో ఒక్క విజయవాడ కమిషనరేట్ పరిసర ప్రాంతాల్లోనే విస్తృత స్థాయిలో కోడి పందాలు జరిగాయి. దాదాపుగా పోలీసులు 104మంది పందాల రాయుళ్లను చెదరగొట్టారు. 27మంది మీద నేరుగా కేసులు నమోదు చేశారు. 62 పందెం కోళ్లను, దాదాపుగా రెండు లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. ఇవి కేవలం ఒక్క విజయవాడ చుట్టుపక్కల లెక్కలు.

మొత్తంగా కృష్ణా జిల్లా అంతటా పరిగణనలోకి తీసుకోవాల్సొస్తే పోలీసులు ఈ కోడి పందాలకు సంబంధించి, బెట్టింగులకు సంబంధించి దాదాపు మూడు వందలమందికి పైగా వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. రెండు లక్షల రూపాయలకు పైగా నగదును, రెండు వందలకు పైగా పందెం కోళ్లను, రెండు వందలకు పైగా ఆ కోళ్ల కాలి వేళ్లకు కట్టే పదునైన కత్తుల్ని సీజ్ చేసినట్టుగా సమాచారం.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.